హైదరాబాద్ శివారు నార్సింగ్‌లోని శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల సిబ్బంది వేధించడంతోనే తాను చనిపోతున్నట్లు సాత్విక్ లేఖలో వెల్లడించాడు.
“అమ్మానాన్న ఐ లవ్ యూ..మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు పెట్టే టార్చర్ తో ఆత్మహత్య చేసుకుంటున్నాను. కృష్ణా, ఆచార్య, శోభన్, నరేష్ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి. అమ్మానాన్న ఐ లవ్ యూ..మిస్ యూ ఫ్రెండ్స్” అంటూ సాత్విక్ రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది.
కార్పోరేట్ కళాశాలల వేధింపులు, ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఒత్తిడి చదువులకు చిన్నారులు బలవుతున్నారు. కళాశాలల సిబ్బంది టార్చర్‌ను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ పడుతున్న మానసిక ఆందోళనను ప్రతీ ఒక్క విద్యార్థి అనుభవిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఇలాంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో ఫలితం లేకుండా పోతోంది. తల్లిదండ్రులు సైతం మార్కులు, ప్రెస్టేజ్ ఇష్యూ కోసం లక్షలు ఖర్చు చేసి తమ పిల్లల చావులకు కారణమవుతున్నారు.