‘కశ్మీర్’పై పాక్‌కు సౌదీ షాక్.. అప్పు కక్కలేక, ఆయిల్ దొరక్క..  - MicTv.in - Telugu News
mictv telugu

‘కశ్మీర్’పై పాక్‌కు సౌదీ షాక్.. అప్పు కక్కలేక, ఆయిల్ దొరక్క.. 

August 12, 2020

Saudi Arabia ends a loan and associated oil supply to Pakistan.

కశ్మీర్ విషయంలో ఇస్లాం దేశాలను ఏకం చేయాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఫలితంగా కొన్ని రోజుల వ్యవధిలో బిలియన్ డాలర్ల అప్పు కట్టాల్సి వచ్చింది. అలాగే 3.2 బిలియన్ డాలర్ల రాయితీ చమురుకి కూడా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే..కశ్మీర్ అంశంలో సౌదీ అరేబియాను భారత్ పైకి ఎగదోయాలనుకున్న పాకిస్థాన్ తహతహలాడుతోన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్ సహకార సంఘం(ఓఐసీ) కశ్మీర్ అంశంలో సరిగ్గా స్పందించడం లేదని పాకిస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీయవచ్చని సౌదీని హెచ్చరించినంత పని చేసింది. 

అలాగే పాక్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..ఓఐసీలో చీలికలు వచ్చే అవకాశం ఉందన్నారు. 57 దేశాల సభ్యత్వం ఉన్న ఓఐసీని కశ్మీర్ అజెండాపై సమావేశపర్చడంలో సౌదీ అరేబియా విఫలమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంపై తామే ఓఐసీని సమావేశపర్చుతామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను సౌదీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తాము అందించిన 3 బిలియన్ డాలర్ల రుణంలో ఒక బిలియన్ డాలర్లను వెంటనే వసూలు చేసింది. మిగతా రెండు బిలియన్ డాలర్ల రుణంపై ఒత్తిడి పెంచింది. అలాగే 3.2 బిలియన్ డాలర్ల విలువైన చమురును రాయితీపై పాకిస్తాన్ కి అందించడానికి చేసుకున్న ఒప్పందాన్ని కూడా సౌదీ రద్దు చేసింది. దాంతో పాకిస్తాన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.