సౌదీ అరేబియా తన మొట్టమొదటి మహిళా వ్యోమామిని ఈ ఏడాది చివర్లో అంతరిక్ష యాత్రకు పంపనుంది. అల్ట్రా కన్సర్వేటివ్ ఇమేజ్ ను పునురుద్ధరించే పనిలో భాగంగా ఆమెను పంపనున్నట్లు రాష్ట్ర మీడియా పేర్కొంది. సౌదీలో అమ్మాయి ఒంటరిగా తిరుగడమే నిషేధం. మెల్లమెల్లగా కట్టుబాట్లను చెరిపేస్తున్నా కూడా ఇంకా కొందరు ఆ బందీఖానాల్లోనే ఉన్నారు. అలాంటి దేశంలో ఉన్న ఒక మహిళ మొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్నది. ఇది నిజంగా చరిత్రే అవుతుంది.
మొదటగా..
‘2023 రెండవ త్రైమాసికంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) మిషన్ లో సౌదీ పురుష వ్యోమగామి అలీ అల్ ఖర్నీతో.. రయ్యానా బర్నావి కూడా చేరనున్నారు. వ్యోమగాములు ఎఎక్స్-2 స్పేస్ మిషన్ సిబ్బందిలో చేరుతారు. ఈ అంతరిక్ష విమానం యూఎస్ఎ నుంచి ప్రారంభించబడుతుంది’ అని సౌదీ అధికారిక ఏజెన్సీ తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019లో తన పౌరులలో ఒకరిని అంతరిక్షంలోకి పంపిన మొదటి అరబ్ దేశంగా అవతరించింది.
ఎన్నో సంస్కరణలు..
సౌదీ వాస్తవాధినేత క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. 2017లో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మగ సంరక్షకులు లేకుండా మహిళలు డ్రైవింగ్ చేయడానికి, విదేశాలకు వెళ్లడానికి అనుమతించబడ్డారు. అంతేకాదు శ్రామిక శక్తిలో వారి నిష్పత్తి 17 శాతం నుంచి 37శాతానికి పెరిగింది.
మరింతగా..
1985లొ సౌదీ రాజకుమారుడు సుల్తాన్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఒక వైమానిక దళ పైలెట్. యూఎస్ నిర్వహించిన అంతరిక్ష యాత్రలో పాల్గొన్నాడు. అలా అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అరబ్ ముస్లిం అయ్యాడు. 2018లో సౌదీ అరేబియా అంతరిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గత సంవత్సరం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి మరొకటి ప్రారంభించింది. ఇది 2030 ఆర్థిక వైవిద్యీకరణ కోసం ప్రిన్స్ సల్మాన్ తీసుకున్న ఎజెండా. దీనివల్ల మరికొందరు వ్యోమగాములు అంతరిక్షంలోకి అడుగు పెట్టాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.