అందరూ ఉమ్మేస్తున్న పాకిస్తాన్‌కు సౌదీ ముద్దులు.. ఎందుకు?   - MicTv.in - Telugu News
mictv telugu

అందరూ ఉమ్మేస్తున్న పాకిస్తాన్‌కు సౌదీ ముద్దులు.. ఎందుకు?  

February 18, 2019

ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెది మరోదారి అన్నట్లు.. జాతిమతాలతో సంబంధం లేని ఉగ్రవాదాన్ని ఒకవైపు ప్రపంచమంతా అసహ్యించుకుంటూ ఉంటే, పాకిస్తాన్ మాత్రం దానికి పాలుపోసి పోషిస్తోంది. తన భూభాగంలో లెక్కలేనన్ని ఉగ్రముఠాలకు ఆశ్రయమిస్తోంది. అవి భారత్ భూభాగంలో దాడులు చేయడానికి దగ్గురండి మరీ అన్నిరకాల సాయం చేస్తోంది. పుల్వామా దాడితో పాక్ మరో పాపం మూటగట్టుకుంది. ప్రపంచ దేశాలు ఆ దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పాక్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని కోరుతున్నాయి.

కానీ కొన్నిదేశాలు మాత్రం పాక్‌ను పళ్లెత్తుమాట అనడం లేదు. పైగా దాంతో బంధాలను బలోపేతం చేస్తుకుంటామంటున్నాయి. చైనా, సౌదీ అరేబియా ఈ దేశాల జాబితాలో మొదటి స్థానాల్లో ఉన్నాయి. గతంలో ఈ జాబితాలో ఉన్న అమెరికా 9/11 లాడెన్ అనుభవంతో ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గగా, ఆ స్థానాన్ని తాను భర్తీ చేస్తామంటోంది పెట్రోల్ కింగ్ దేశం. అందుకే భారత వినుతులను బేఖాతరు చేస్తూ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో చక్కర్లు కొడుతున్నాడు.

ఆ దేశానికి భారీ ఆర్థిక, హార్దిక సాయం ప్రకటించాడు. అతనికి పాక్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందించి రుణం తీర్చుకుంటోంది. సౌదీలోని వందలాది పాక్ ఖైదీలు కూడా విడుదల కానున్నారు. పుల్వమా దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నా సౌదీ యువరాజు మాత్రం పళ్లెత్తు మాట అనుకుండా పాక్ నేతలను పొడుగుతున్నాడు. అసలు పాకిస్తాన్ తీరును సౌదీ ఎప్పుడూ ఆక్షేపించలేదు. ఇకపైనా సౌదీ తీరు మారే అవకాశం లేదు. ఎందుకు?

ముస్లిం ప్రపంచానికి ప్రతినిధిగా..

ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న సౌదీ.. ముస్లింల దేశాల్లో అత్యంత ధనిక దేశం. మక్కా మసీదు కూడా అక్కడే ఉండడంతో అది తననకు తాను ఇస్లాం ప్రపంచానికి ప్రతినిధినని, ముస్లిం దేశాలన్నీ తనకు లోబడి ఉండాలని భావిస్తూ ఉంటుంది. అందుకే ప్రపంచంలో తనకు ఇబ్బంది కలిగించని ఏ ముస్లిం దేశంతోనైనా దోస్తీ కడుతుంటుంది. అరేబియన్ ద్వీపకల్పంపై, చుట్టుపక్కల ప్రాంతాలపై ఆధిపత్యం కోసం యత్నించే ఇరాన్, ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్, లిబియా, రష్యా వంటి దేశాలకు వ్యతిరేకంగా కూటముటు కడుతుంటుంది. ఓ పక్క అమెరికాకు స్నేహహస్తం చాస్తూనే..దానికి వ్యతిరేకంగా ఉగ్రశక్తులకు పాదులు తీస్తూ ఉంటుంది. ఇంత చేస్తున్నా అమెరికాకు దానిపై చర్యలు తీసుకునే ధైర్యం లేదు. ఉగ్ర తండాలున్న ముస్లిం దేశాల్లో సైనిక చర్యలు తీసుకోవాలంటే ప్రపంచ పెద్దన్నకు నౌసర్గికంగా, ఆర్థికంగా సౌదీ సాయం అవసరం.

ఇంకా లోపాయికారీ పనులకు కూడా సౌదీ సహకరిస్తుంటుంది. అదే సమయంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి మద్దతిచ్చే పాకిస్తాన్ వంటి దేశాలతోనూ దోస్తీ చేస్తుంది, డబ్బుల వర్షం, పెట్రో వర్షం కురిపిస్తుంది. పాక్ అణ్వస్త్ర కార్యక్రమంలో సౌదీ భాగస్వామ్యం కూడా ఉందంటే, సౌహార్ద సంబంధాల పేరుతో పాకిస్తాన్‌కు ఇప్పటికీ వందలాది సైనికులను పంపుతోందంటే ఆ రెండు దేశాల బంధం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమాసియా దేశాల్లో తన మాటే చెల్లుబాటు కావాలన్నది సౌదీ తపన.

భారత్ వ్యతిరేకతే ధ్యేయంగా పాక్..

Related image

పాకిస్తాన్‌కు సౌదీ సాయం ప్రస్తుతం పరిస్థితుల్లో మరింత అవసరం. అల్ కాయిదా లాడెన్ తనగడ్డపైనే హతమయ్యాక పాక్ ఉగ్రస్వరూపం ప్రపంచానికి స్పష్టంగా తెలిసిపోయింది. అమెరికాను నుంచి అందుతున్న సాయానికి కోత పడుతోంది. చైనా కమ్యూనిస్టుల సాయం అందుతున్నా.. ఇస్లామిక్ సెంటిమెంటుతో కూడా సాయం అవసరమైతే మరింతగా నైతికంగా బలపడొచ్చు, ప్రజల సెంటిమెంట్లను కూడా సంతృప్తి పరచొచ్చు. అందుకే సౌదీతో నిత్యం టచ్‌లో ఉంటుంది. శక్తిసామర్థ్యాల పరంగా భారత్‌కు దీటు రాలేదు కాబట్టి చైనా సాయంతోపాటు  సౌదీ సాయం కూడా తప్పనిసరి. మొత్తంగా పరస్పర అవసరాల కోసం సౌదీ, పాకిస్తాన్‌లు దశాబ్దాలుగా జట్టుకట్టి సాగుతున్నాయి. ప్రపంచం వాటి సంబంధంపై ఎన్ని వ్యాఖ్యానాలు, విమర్శలు చేసినా అవి పట్టించుకోవు. మధ్యలో బలిపశువులయ్యేవి భారత్ వంటి దేశాలే. 1971 నాటి పాకిస్తాన్-భారత్ యుద్ధంలో పాక్‌కు సాయంగా యుద్ధవిమానాలు పంపిన సౌదీ అరేబియా.. భవిష్యత్తులో మళ్లీ భారత్, పాక్‌ల మధ్య యుద్ధం వస్తే ఎవరిపైపు నిలబడుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు,.