తీవ్ర ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం, ఆహార కొరతతో దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కి సౌదీ అరేబియా ఆపన్న హస్తం అందించింది. ఆ దేశానికి సాయం చేయడానికి, పెట్టుబడులను పెంచడానికి ఉన్న అవకాశాలను వెతకాలని అధికారులను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించారు. అలాగే పాక్ బ్యాంకుల్లో సౌదీకి ఉన్న 3 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలను 5 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటితో పాటు పాక్ లో పెట్టుబడులను పది బిలియన్ డాలర్ల కంటే పెంచడానికి గల మార్గాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. కాగా, గతంలో సౌదీ పాకిస్తాన్ కు 3 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది. అయితే ఈ నిధులను ప్రత్యక్షంగా వాడుకోకుండా అనేక షరతులు విధించింది.
కేవలం తనఖాగా చూపించి సరుకులు కొనుగోలు చేయవచ్చనే షరతు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ సాయాన్నే 3 నుంచి 5 బిలియన్ డాలర్లకు పెంచాలని ఎంబీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు తొమ్మిదేళ్ల కనిష్టానికి (5.6 బిలియన్ డాలర్లు)కు పడిపోయాయి. ఇవి ఒక నెల దిగుమతులకు సరిపోతాయి. ఈ నేపథ్యంలో సౌదీని ఆశ్రయించడక తప్పలేదు. అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం కోసం వెళ్లగా, విడతల వారీగా 800 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కానీ ప్రజలపై పన్నులు పెంచాలనే షరతు విధించడంతో పాక్ వెనక్కు తగ్గింది. రుణం తీసుకొని పన్నులు పెంచితే ప్రజానీకం తిరగబడుతుందనే భయం నాయకుల్లో ఉంది. దీంతో ఈ రుణం ప్రస్తుతం సందిగ్ధావస్థలో ఉంచబడింది. ప్రస్తులం పాక్ రూపాయి డాలరుకు 228 రూపాయిలుగా నడుస్తోంది. దీని విలువను కాపాడుకునేందుకు పాక్ అనేక తంటాలు పడుతోంది.