ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాలను భర్తీ చేసేందుకు తన కేబినెట్‌లోకి సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కొత్తవారిని తీసుకున్నారు. ఎమ్మెల్యేలు అతిషీ, సౌరభ్ భరద్వాజ్ల పేర్లను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. వీరిద్దరిని కేబినెట్లోకి తీసుకునేందుకు సంబంధించిన ముసాయిదాను బుధవారం ఉదయం గవర్నర్ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ల రాజీనామాలను గవర్నర్ వీకే సక్సేనా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. రాజీనామాలను ఆమోదించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రూపకల్పన, అమలులో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొన్న సిసోదియా, జైన్లు ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసి కోర్టు అనుమతితో ఐదు రోజుల రిమాండ్కు తరలించారు. కాగా, సత్యేంద్ర జైన్నను మనీలాండరింగ్ కేసులో గతేడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.