కర్ణాటక అసెంబ్లీలో అధికార పక్షం ఏర్పాటు చేసిన ఓ చిత్రపటం.. తొలిరోజే పెద్ద రచ్చకు దారి తీసింది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశం కాస్త రసాభాసాగా మారి ఆందోళనకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో నేడు అధికార బీజేపీ వీడీ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతిపిత మహాత్మాగాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, బసవన్న, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, డా. బి.ఆర్ అంబేడ్కర్ చిత్ర పటాల పక్కనే వీర సావర్కర్ ఫొటో పెట్టడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది.
బీజేపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. సావర్కర్ చిత్రపటాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, అసెంబ్లీలో వాల్మీకి, బసవన్న, కనకదాస, బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులను చిత్రపటాలను కూడా ఉంచాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. వివాదాస్పద నేతల ఫొటోలను అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ అవినీతిపై తాము ప్రశ్నలు లేవనెత్తుతామని బొమ్మై సర్కార్‌కు తెలుసునని, అందుకే సభా కార్యకాలాపాలు జరగకుండా కావాలనే వీర్ సావర్కర్ బొమ్మ పెట్టారని ఆరోపించారు. వెంటనే ఆయన ఫొటోను అసెంబ్లీ నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు వీర్ సావర్కర్‌పై తప్పుడు ప్రచారాన్ని పోగెట్టేందుకు తాము రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీజేపీ చెబుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో సావర్కర్ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు భయపడి క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని కాంగ్రెస్ చెబుతోంది. ఇది తప్పుడు ప్రచారం అని, ఆయన స్వతంత్ర సమరయోధుడని బీజేపీ వాదిస్తోంది. అంతేకాదు బొమ్మై సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గురించి కార్యక్రమాలు చేపడుతుండటం గమనార్హం.