ఒకప్పుడు అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన ఈ దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన ధీర మహిళ శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అణగారిన వర్గాల మాతృమూర్తి. విద్య ద్వారానే స్త్రీ జాతి విముక్తి సాధ్యమని బలీయంగా నమ్మి దేశంలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన మహోన్నత వ్యక్తి.
మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో జన్మించారు సావిత్రి బాయి. ఆమె కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్, నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలేను 1840లో వివాహమాడింది. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. జ్యోతీరావు ఫూలె ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.
ఉపాధ్యాయురాలిగా….
సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. దళితుల, స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు.
సామాజిక విప్లవకారిణిగా….
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. లింగ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి “సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు.
ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న తల్లిగా..
బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి.
వేగుచుక్కగా నిలిచి..
1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి, 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుబోధ్ రత్నాకర్’ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.