సిరిసిల్లలో సావిత్రిని పగలగట్టి, అక్కడ పెరియార్ తలకొట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

సిరిసిల్లలో సావిత్రిని పగలగట్టి, అక్కడ పెరియార్ తలకొట్టి..

March 20, 2018

వాదనలను వాదనలతోనే ఎదుర్కోవాలి. విధ్వంసానికి తెగబడితే చివరికి ఏమీ మిగలదు. ఇప్పటికే యుద్ధాల్లో ఎంతో విలువైన సంపదను, కళాఖండాలను పోగొట్టుకున్న దేశం మనది. ప్రజాస్వామ్యం, సామరస్యం వర్ధిల్లాల్సిన దేశంలో అర్థంపర్థం లేని విధ్వసంకాండకు తావులేదు. అందులోనూ మానవజాతి పురోగతికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిస్స్వార్థంగా పనిచేసిన మహనీయుల చిహ్నాలను పదిలంగా కాపాడుకోవాలి. లేకపోతే భావితరాలు మనల్ని క్షమించవు

శతాబ్దాలపాటు విద్యకు నోచుకోని స్త్రీలకు విద్యగరపడానికి ఉద్యమంలా పనిచేసిన సావిత్రీబాయి ఫూలే అందరికీ అదర్శప్రాయురాలు. స్త్రీజనోద్ధరణకు ఆమె చేసిన కృషి అజరామరం. అందుకే రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం సుద్దాల గ్రామంలో ఆమెను స్మరించుకోవడానికి మూడు రోజుల కిందట విగ్రహం నెలకొల్పారు. అయితే ఆ స్ఫూర్తిదాయిని చిహ్నం కొందరికి కంటగింపైంది. గతరాత్రి ముక్కును, కంటిభాగాన్ని ధ్వంసం చేశారు.

ఇది స్థానికుల్లో ఒక వర్గం వారి పనేనని భావిస్తున్నారు. మరోపక్క.. త్రిపురలో మొదలై దేశమంతా పాకిన విగ్రహ విధ్వంస కాండ తమిళనాడులో తీవ్రమైంది. హేతువాది పెరియార్ రామస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వసం చేశారు. పుదుక్కొట్టై జిల్లాలో ఈ దారుణం జరిగింది. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిన తర్వాత కూలబోయేది పెరియార్ విగ్రహమేనని తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా హెచ్చరించాక రాష్ట్రంలో రోజుకోచోట పెరియార్ విగ్రహం నేలకూలుతోంది.