మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు… పాట అందెశ్రీ ఏ క్షణంలో రాశారో కానీ…. మన దేశంలో మానవత్వం లేని వాళ్లు కోటాను కోట్ల మంది ఉన్నారని ప్రతి రోజూ ఏదో ఒక చోట ప్రూవ్ అవుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో మనిషనేవాడు ఎన్నడో మాయం అయినట్లుంది. ఈ మోబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్లు తీసుకుంటున్న వీడియోలను బట్టి తెలుస్తున్నది. మనిషి ప్రాణాలు పోతున్నా సరే సెల్ ఫోన్లో వీడియో సరిగ్గా వస్తున్నదా లేదా అనేది చూసుకుంటున్నారు. సాయం కోసం ఆరిచి గీ పెట్టినా వీరి చెవులకు ఎక్కడం లేదు. ఇట్లా తాము మనుష్యులమనే విషయాన్ని మర్చిపోయిన కొంత మంది మనిషి రూపంలో ఉన్న వింత జంతువులు తమకు గుండె, మనస్సు లేదని నిరూపించుకున్నారు…
ఈ దేశంలో కుల వ్యవస్థ తీరు ఎట్లా ఉంది… దాని పునాదులు ఎంత గట్టిగా ఉన్నాయో కూడా మళ్లీ మళ్లీ రుజువు అవుతూనే ఉంది. మహారాష్ట్ర భోకర్ తాలుకా, కేర్బాన్ చెందిన పూజ, గోవిందులు ప్రేమించుకున్నారు. పూజ వడ్డెర కులం, గోవిందు దళితుడు. వీళ్ల ప్రేమను పెద్దలు ఒప్పు కోలేదు. పూజకు వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. కొద్ది రోజుల తర్వాత తాను ప్రేమించిన అబ్బాయితో కల్సి పూజ తాము కల్సి బతికేందుకు వెళ్లి పోయింది. ఆమె కుటుంబ సభ్యులు వీరు లేచిపోవడం గురించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరకు పూజ సెల్ ఫోన్ కు ఆమె సోదరుడు దింగబర్ ఫోన్ చేశాడు. ఇంటికి వస్తే పెళ్లి చేస్తామని నమ్మించాడు. సోదరుని మాటలు నమ్మిన పూజ తాము ఎక్కడున్నామో చెప్పింది. అక్కడికి చేరుకున్న దిగంబర్ కత్తితో గోవిందును చంపేశాడు. ఆ తర్వాత పూజ గొంతులో కత్తి దింపాడు. పారిపోయాడు. రోడ్డుపై సాయం కోసం ఎదురు చూస్తున్న పూజ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా సెల్ ఫోన్లల్లో ఫోటోలో , వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. కనీసం అంబులెన్స్ కూడా ఫోన్ కూడా చేయలేదు. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. చివరకు ఆమె లేచి రోడ్డు పక్కకు వెళ్లి కూచుకున్నది. ఆ తర్వాత చనిపోయింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత దీనికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి.
దీన్ని అంతా వీడియోలు తీసిన జనాలు కనీసం ఆమె గురించి పట్టించుకోలేదు. వాళ్ల గుండెలు కరుగ లేదు. అయ్యో అనే మనస్సే వారికి లేకుండా పోయింది. అయినా తన వాళ్లు మనుష్యులు అనుకుని ఇంటి వారిని నమ్మడం…. తన చుట్టూ ఉన్న వారు కూడా మనుష్యులు అని ఆమె భావించడం అన్నింటి కంటే పెద్ద తప్పు కావొచ్చు. ఇండియాలో మనుష్యుల కంటే కులం గొప్పది… మన దేశంలో మనిషి ప్రాణం కంటే గుండె లేకుండా జీవచ్చవంలా.. రోబోలా తిరగడం ఇంకా గొప్పది. అని జనాలు అనుకుంటున్నట్లుంది.
ఇంత దారుణానికి కారణం కులం. ఇంతకూ ఈ దేశంలో కులాన్ని రద్దు చేసే దమ్ము ఎవరికైనా ఉందా… ఇది పెద్ద నోట్ల రద్దు అంత ఈజీ కాదు… జీఎస్టీ ప్రవేశపెట్టినంత సులభం కాదు అందరూ సమానమని… కులాలు లేవని చెప్పడానికి. ప్రేమలు… ప్రేమ పెళ్లిల్లు హత్యకాకుండా ఉండాల్నంటే…. వాటిని బతికించే వారికి హృదయం ఉండాలి. ఈ దేశంలో కులం ఉన్నన్నీ రోజులు…ఇవేవీ సాధ్యం కావు. మళ్లీ మళ్లీ తాము మనుష్యులమే కాదని ప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు సెల్ ఫోన్ల సాక్షిగా చాలా మంది జనాలు.