ఓంకారం, గోమాత అంటే ఎందుకంత ఉలికిపాటు..మోదీ, మనుషుల మాటేంటన్న ఒవైసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఓంకారం, గోమాత అంటే ఎందుకంత ఉలికిపాటు..మోదీ, మనుషుల మాటేంటన్న ఒవైసీ

September 11, 2019

బీజేపీ ప్రభుత్వం గోవులకు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశమై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ప్రభుత్వం గోవులకు ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. గోవుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై ఆయన ధ్వజమెత్తారు. గోవులకు ప్రాధాన్యత ఇచ్చినంత మాత్రాన.. దేశం నాశనమైపోతున్నట్టు కొంతమంది విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘కొంతమందికి ఆవు, ఓం అన్న పదాలు వినిపిస్తే చాలు.. దేశం 16వ శతాబ్దానికి వెళ్తోందని గగ్గోలు పెడుతుంటారు.. నిజానికి అలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమైపోతోంది’ అన్నారు. 

బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కౌంటర్ ఇచ్చారు. ఒవైసీ మాట్లాడుతూ.. ఆవు హిందూ సోదరులకు పవిత్ర జంతువు కానీ, మన రాజ్యాంగం అందరికీ సమానంగా బతికే హక్కు కల్పించింది. ఇది మోదీ దృష్టిలో పెట్టుకుంటే మంచిది అన్నారు.