SBI Bank waived off 54 lakhs to Bangalore woman
mictv telugu

కరోనా ఎఫెక్ట్.. బ్యాంకులో 54 లక్షలు మాఫీ చేయించుకున్న మహిళ

July 21, 2022

కరోనా కారణంగా భర్త మరణించడంతో అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న మహిళకు ఇంటి లోన్ తీసుకున్న బ్యాంకు వారి వేధింపులు ఇబ్బందికరంగా మారింది. దీంతో వినియోగదారుల కోర్టులో కేసు వేసి తాను తీసుకున్న లోన్ మొత్తం రూ. 54 లక్షలను మాఫీ చేయించుకుంది. దాంతో పాటు లక్ష పరిహారం, ఖర్చులకు 20 వేలు చెల్లించాలని కోర్టు బ్యాంకును ఆదేశించింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వివరాలు.. నగరానికి చెందిన ధరణి (38) భర్త కరోనా వ్యాధి సోకి చనిపోయారు. ఆయన బతికుండగా ఎస్బీఐలో హౌసింగ్ లోన్ తీసుకోగా, వాటిని చెల్లించాలని బ్యాంకు సిబ్బంది ఇబ్బంది పెట్టడంతో ధరణి వినియోగదారుల కోర్టులో కేసు వేసింది. భర్త మరణం తర్వాత పిల్లల పోషణ, అత్తామామలు, ఇంటి ఖర్చులకే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు సరిపోవడం లేదని, లోన్ మీద ఇన్సూరెన్స్ చేయించినా బ్యాంకు వారు లోన్ మాఫీ చేయడం లేదని ఫిర్యాదు చేసింది. దీనికి కౌంటర్‌గా బ్యాంకు వారు సమాధానమిచ్చారు. అందులో ‘ఆమె భర్త లిఖిత పూర్వకంగా ఇన్సూరెన్స్ పాలసీ కోసం అంగీకారం తెలియజేయలేదు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటామని అప్లికేషన్‌లో yes అని టిక్ చేశారు. అమౌంట్ కూడా విత్ డ్రా అయింది కానీ, డబ్బు ఎస్బీఐ లైఫ్‌కు చేరలేదు’ అని వివరించింది. దీంతో బ్యాంకు వారి సేవా లోపాన్ని గ్రహించిన కోర్టు.. ‘లోన్ మంజూరు సమయంలో ఇన్సూరెన్స్ ప్రక్రియ పూర్తి చేసే బాధ్యత బ్యాంకు వారిదే కాబట్టి వారు ఇందులో విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి వారి లోన్ మొత్తాన్ని మాఫీ చేసి పరిహారం, ఖర్చుల కింద డబ్బులు ఇవ్వాలని బ్యాంకు వారిని ఆదేశిస్తున్నాం’ అని తీర్పిచ్చింది.