భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) సర్వర్లు మరోసారి మొరాయించాయి. దీంతో ఈరోజు ఉదయం నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యునో ఆప్ సేవలు నిలిచిపోయాయి. ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్లు మాత్రం పనిచేస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించే కష్టమర్లు లావాదేవీలు చేయలేకపోతున్నారు.
దీంతో ఎస్బీఐపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్బీఐ ట్విట్టర్లో స్పందించింది. కనెక్టివిటీలో లోపం కారణంగా సేవలకు అంతరాయం కలిగిందని ట్వీట్ చేసింది. త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్టుగా వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. ‘కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో కనెక్టివిటీ సమస్య ఏర్పడింది. ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ఏటీఎం, పాయింట్ ఆఫ్ సేల్స్ మెషీన్లు మినహా అన్ని ఛానళ్లు ఆగిపోయాయి. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తాం. ఇలాంటి సమయంలో కస్టమర్లు అండగా నిలవాలని కోరుకుంటున్నాం’ అని ఎస్బీఐ ట్వీట్లో పేర్కొంది.