ఎస్‌బీఐ శుభవార్త.. మినిమం బ్యాలెన్స్ తగ్గించి.. .  - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌బీఐ శుభవార్త.. మినిమం బ్యాలెన్స్ తగ్గించి.. . 

September 13, 2019

SBI ...

ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ కట్టాల్సిందే అంటోంది. అలాగే ఇంతకు ముందులా వున్న బ్యాంకు ఖాతాల్లో కస్టమర్లు ఉంచాల్సిన కనీస నిల్వల మొత్తాన్ని తగ్గించింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లోని స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలో కనీసం రూ.5 వేల మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని నిబంధన వుండేది. ఇప్పుడు దానిని రెండు వేలకు తగ్గించి రూ.3 వేలు చేసింది. అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారి ఖాతాల్లో కనీసం రూ.2,000, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల ఖాతాలో కనీసం రూ.వెయ్యి నిల్వ ఉండటం తప్పనిసరి అని తెలిపింది. సడలించిన ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానాల వడ్డన తప్పదని తేల్చి చెప్పింది. 

జరిమానాలు ఇలా.. 

పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నిల్వ రూ.1500 వరకు మాత్రమే ఉంటే రూ.10, రూ.750 వరకు వుంటే రూ.12.75, ఇంకా అంతకు తగ్గిపోతే రూ.15 ఫైన్ కట్టాలి. ఇక సేవింగ్స్ ఖాతాలో నెలకు 3 సార్లు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది దాటితే అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగోసారి కనీసం రూ.100 డిపాజిట్ చేసినా రూ.50 అదనపు చార్జీ కింద చెల్లించాల్సిందే. అలాగే నాన్ హోం బ్రాంచీల ద్వారా గరిష్టంగా రూ.2 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చని స్పష్టంచేసింది. వీటికి జీఎస్టీ కూడా అదనమని బ్యాంకు తెలిపింది.

నగదు డ్రా ఇలా.. 

నెలకు కనీసం రూ.25,000 బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు నెలకు రెండుసార్లు ఉచితంగా బ్యాంకు నుంచి నగదును డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అదే రూ.25,000-50,000 మధ్య బ్యాలెన్స్ ఉంచేవారికి 10 విత్ డ్రాలు ఉచితం. ఇది రూ.50,000 దాటితే 15 సార్లు ఫ్రీగా నగదును డ్రా చేసుకోవచ్చు. నెలకు కనీస బ్యాలెన్స్ రూ.లక్ష ఉంచితే ఎన్నిసార్లయినా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇదిలావుండగా మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు నగదును విత్ డ్రా చేసుకునే వెసలుబాటును కల్పించింది. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎం కార్డుదారులు ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో ఐదుసార్లు ఉచితంగా నగదును తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంతో చెక్‌బౌన్స్ అయితే జీఎస్టీతో కలుపుకుని రూ.168 జరిమానా చెల్లించాల్సిందేనని వెల్లడించింది.