ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి ఓ ప్రత్యేక కారణం చేత 15 రోజులపాటు పెరోల్ మంజూరు చేసింది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ హైకోర్టు. సంతానం కోసం అతడి భార్య అభ్యర్థనను విన్న హైకోర్టు గత ఏప్రిల్ లో 15 రోజుల పెరోల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, దానిపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.
రాజస్థాన్‌కు చెందిన నందలాల్ అనే వ్యక్తి ఓ నేరం చేసిన కేసులో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే ఆయనకు సంతానం లేకపోవడంతో.. తన భర్త విడుదలను కోరుతూ అతని భార్య తన “సంతానపు హక్కు”ని కాపాడాలని హైకోర్టును ఆశ్రయించింది. జోధ్‌పూర్ హైకోర్టు న్యాయమూర్తులు సందీప్ మెహతా, ఫర్జాంద్ అలీలతో కూడిన ధర్మాసనం అతని జైలు శిక్ష కారణంగా ఖైదీ భార్య యొక్క లైంగిక , భావోద్వేగ అవసరాలు ప్రభావితం అవుతున్నాయన్నవాదనతో ఏకీభవించింది. దీంతో 34 ఏళ్ల నంద్‌లాల్‌కు 15 రోజుల పెరోల్ మంజూరు చేయడానికి అంగీకరించింది. వంశ పరిరక్షణ కోసం సంతానాన్ని కలిగి ఉండటం, మత తత్వాలు, భారతీయ సంస్కృతి, వివిధ న్యాయపరమైన అంశాల ద్వారా గుర్తించబడిందని హైకోర్టు తీర్పులో పేర్కొంది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులతో పాటు రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌పై లాల్‌ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ జరపబోతోంది.