వైఎస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
వైఎస్సార్టీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు, టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 30న జోగిపేట పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో ఎమ్మెల్యేపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన భూకబ్జాదారుడని, క్రాంతి కిరణ్ కాదు.. కంత్రి కిరణ్ అని విమర్శించారు. దళితుడయి ఉండి చెరువులు, అసైన్డ్ భూములు కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తండ్రే తన కొడుకులంతా శుంఠలని చెప్పాడంటూ ఆరోపించారు. జర్నలిస్ట్ అయి ఉండి ఎప్పుడైనా జర్నలిస్టుల కోసం పోరాడారా? అని ప్రశ్నించారు. దీంతో షర్మిలపై సీరియస్ అయిన దళిత, టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేను కించపరిచే వ్యాఖ్యలు చేసిన షర్మిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.