స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కరోనా మహమ్మారి నియంత్రణకు వాడాల్సిన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్ళించి వినియోగించింది జగన్ సర్కార్. దీనిపై ఈరోజు కేసు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రెండు వారాల్లోగా ఆ నిధులు తిరిగి ఇవ్వాలని జస్టిస్ ఎం.ఆర్‌షా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నిధులు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు.. రూ. 1,100 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని స్పష్టం చేసింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని వెల్లడించింది.
గతంలోనూ సుప్రీం ధర్మాసనం జగన్ ప్రభుత్వానికి ఈ విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక తాజాగా పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్లించిన డబ్బులు తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలంటూ ఆదేశించింది. మరి సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం 11వందల కోట్ల రూపాయల నగదును రాష్ట్ర విపత్తు నిర్వహణా నిధికి జమ చెయ్యాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్ధిక సంక్షోభంలో ఈ డబ్బు జమ చేస్తుందా? సుప్రీం ఆదేశాలపై ఏం చెయ్యనుంది అనేది తెలియాల్సి ఉంది.