రుణాల చెల్లింపులపై కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
కేంద్రం, ఆర్‌బీఐకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో రుణాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ చేసిన ప్రకటనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై స్పష్టత కోరుతూ సుప్రీం ధర్మాసనం తమ అభిప్రాయం తెలపాలని కేంద్రం, ఆర్‌బీఐకి సూచించింది. భారత స్థిరాస్తి రంగ అభివృద్ది సంస్థ (క్రిడాయ్) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి.. ఈ ప్రకటన స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని తెలిపింది.
క్రిడాయ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే స్పందిస్తూ.. ‘ఆర్‌బీఐ ప్రకటన బ్యాంకులు అన్నింటికీ వర్తించేదిలా ఉంది. కొన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాలను స్థిరాస్తి రంగానికి అందించడం లేదు. కేంద్రం తరఫున దీనికి సమాధానం ఇచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై సంబంధిత విభాగాల నుంచి వివరాలు సేకరిస్తాం’ అని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.