ఈ దేశ భవిష్యత్తునే ప్రభావితం చేయగల అత్యంత కీలకమైన తీర్పునే సుప్రీం కోర్టు నేడు వెలువరించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను నియమించేందుకు ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈసీల నియామకాలు కేవలం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదని , ఈ దేశ భవిష్యత్తుకు మూలమైన ఎన్నికల విధానంలో అధికారుల ఎంపిక ప్రక్రియ అధికారంలో ఉన్నవారు మాత్రమే నిర్ణయించకూడదని అభిప్రాయ పడింది. అయితే, ఈ పదవులకు నియామకాలు జరిపేందుకు అనుసరించాల్సిన నియమ నిబంధనలను ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తుల కమిటీ రూపొందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
జస్టిస్ కేఎం జోషి నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం నాడు ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద జరిపే ఈ నియామకంలో అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.”ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత/ అధికార కూటమి తరువాత అత్యధిక స్థానాలున్న ఏకైక పార్టీ నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తారు. ఈ మేరకు పార్లమెంటు చట్టం చేసేంతవరకు ఈ పద్ధతి కొనసాగుతుంది” అని సుప్రీం కోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీయే నియామకాలు జరపాలని కోర్టు స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకపోతే వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సీబీఐ చీఫ్ నియామకం తరహలోనే ఎన్నికల కమిషన్ ను నియమించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిందిదేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలిజియం తరహ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కీలకమైన తీర్పును ఇచ్చింది.
ప్రస్తుత విధానంలో కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నికల కమీషనర్ గా నియమించే అధికారం ఉంది. ఈ పదవులకు నియామకాలు కేంద్ర ప్రభుత్వమే జరుపుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఆ పద్ధతిని రద్దు చేసింది. ప్రధాని , ప్రధాన ప్రతిపక్ష నాయకుడు/రాలు, ప్రధాన న్యాయమూర్తి … ఈ ముగ్గురితో ఏర్పడిన కమిటీయే ఎన్నికల కమీషన్ ను నియమించేలా కొత్త విధానం ఏర్పాటు చేయాలని అదేశించింది. సుప్రీం తాజా నిర్ణయం ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేయగలదని మేధావి వర్గం భావిస్తోంది.