అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్‌బోర్డు కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పుపై సున్నీ వక్ఫ్‌బోర్డు కీలక నిర్ణయం

November 26, 2019

ఇటీవల అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో సున్నీ వక్ఫ్‌బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకుందని సున్నీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖి మంగళవారం వెల్లడించారు. బోర్డు కీలక సమావేశంలో  ఏడుగురు సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేయరాదని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మొత్తం ఆరుగురు సభ్యులు రివ్యూ పిటిషన్ వేయరాదన్న అభిప్రాయాన్ని వెల్లడించారని ఆయన తెలిపారు. 

Sunni Central Waqf Board.

అయితే అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదు ఎకరాల భూమిని తీసుకోవాలా వద్దా అన్నది బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ‘దీనికై మరింత సమయం అవసరం. షరియత్ ప్రకారం ఇది సరైనదా అన్నది ఆలోచించాల్సి ఉంది’ అని ఫరూఖి తెలిపారు. కాగా, బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు ఈ నెల 9న తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి మొత్తాన్ని రామ్ లల్లాకి అప్పగించాలనీ… మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో 5 ఎకరాల భూమి కేటాయించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.