యూపీలో అత్యాచారం.. ఫిర్యాదు చేయడానికి 800 కి.మీ ప్రయాణం - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో అత్యాచారం.. ఫిర్యాదు చేయడానికి 800 కి.మీ ప్రయాణం

October 5, 2020

Scary for women in UP! A woman travels over 800 km from Lucknow to file rape case in Nagpur

యూపీలో మహిళల మీద హత్యాచారాలు నిత్యకృత్యం అయిపోయాయి. ఓ ఘటన గురించి అట్టుడుకుతుండగానే దుండగులు యథేచ్ఛగా మరో దారుణానికి ఒడిగడుతున్నారు. అంతేగానీ అస్సలు భయం అన్నది లేకుండా పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. తాజాగా యూపీలో ఓ యువతిని అత్యాచారం చేశాడో దుండగుడు. తనకు న్యాయం కావాలంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఏకంగా 800 కిలోమీటర్లు ప్రయాణించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. నేపాల్‌కు చెందిన ఓ యువతి(22) ఉద్యోగం నిమిత్తం రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి తన స్నేహితురాలితో కలిసి ఓ అద్దె ఇంట్లో కలిసి ఉంది. సదరు స్నేహితురాలు దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోన్న తన స్నేహితుడు ప్రవీణ్ రాజ్‌పాల్ యాదవ్‌ను వీడియో కాల్‌ ద్వారా ఆమెకు పరిచయం చేసింది. అయితే అప్పటికే నేపాలీ యువతి తన వద్ద ఉన్న సొమ్మును స్నేహితురాలికి ఇచ్చి దాచమంది. ఆమె వాటిని తీసుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ యువతి బాధితురాలిని తీవ్రంగా హింసించింది. 

ఈ విషయాన్ని కొత్తగా పరిచయమైన దుబాయ్‌ స్నేహితుడికి చెప్పింది. కానీ, అతను కూడా ఓ కాలనాగు, కాటేస్తాడని ఊహించలేకపోయింది. అతను ఆమెను అక్కడినుంచి వచ్చేయమని, దగ్గర్లోని హోటల్‌లో గది బుక్‌ చేశానని, అక్కడే ఉండమని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు హోటల్‌లో ఉంది. అతడిది కూడా లక్నోనే కావడంతో రెండు రోజుల తరవాత అతడు దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చాడు. హోటల్‌ గదిలో ఉన్న ఆమెను నమ్మకంగా కలిశాడు. ఆమెకు తెలియకుండా డ్రగ్స్‌ ఇచ్చి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత మరోసారి కూడా తన కామ కోరికను తీర్చుకున్నాడు. అనంతరం తను అన్నంత పనిచేశాడు. ఆమె ఫొటోలను, వీడియోలను  సోషల్ మీడియాలో పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, తన మాట వినకపోయినా వాటిని మరింత వైరల్ చేస్తానని బెదిరించాడు. అతని బారినుంచి తప్పించుకున్న యువతి  800 కిలోమీటర్లు ప్రయాణించి, సెప్టెంబర్‌ 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న నేపాలీ స్నేహితురాలి వద్దకు చేరుకుంది. అక్కడికి దగ్గర్లో ఉన్న కొరాడి పోలీసు స్టేషన్‌లో అతని మీద, స్నేహితురాలి మీద ఫిర్యాదు చేశారు. కాగా, వేరే రాష్ట్రం కేసు కావడంతో అక్కడి పోలీసులు దాన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలితో పాటు పోలీసు బృందం లక్నో వెళ్లి అక్కడి చిన్హాట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.