Scary truths in the DAV school incident..Is there security in other private schools?
mictv telugu

డీఏవీ స్కూల్ ఘటనలో భయాంకర నిజాలు.. మిగతా ప్రైవేట్ స్కూళ్లల్లో భద్రత ఉందా?

October 22, 2022

Scary truths in the DAV school incident..Is there security in other private schools?

కార్పొరేట్ స్కూళ్లల్లో పిల్లలకు భద్రత లేదా?సరస్వతీమాత నీడలో మృగాలు దాక్కున్నాయా? పసిపిల్లల నుంచి పదోతరగతి పిల్లల దాకా నో సెఫ్టీయా? బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటన ఏం చెబుతోంది. స్కూల్ గుర్తింపు.. రద్దు పేరెంట్స్ కన్నీళ్లు తుడిచేస్తుందా?భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమైనా భరోసా ఇస్తున్నారా?డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్ వేసే కమిటీలు చిన్నారులకు భద్రత ఇస్తాయా? తూతూ మంత్రంగా ముగించేస్తారా? మిగతా స్కూళ్లల్లో పరిస్థితి ఏంటి?చిన్నారుల నుంచి పదో తరగతి పిల్లల దాకా భద్రత ఉందా?

చిన్నారులకు ఏదీ భరోసా?

పేరున్న స్కూల్స్. వేలకు వేలు డొనేషన్లు,ఫీజులు.అందులో సీట్లు కావాలంటే ఆర్నెళ్ల ముందు నుంచే ప్రయత్నాలు చేయాలి. పిల్లల భద్రత మాత్రం పట్టించుకోరు. ఫీజులపైనే ధ్యాస.పిల్లల్ని చూసుకోవడం అస్సలు తెలియదు. టైమ్ కంటే ముందే ఫీజులు క్లియర్ చేసేయాలి. కానీ చదువులపై మాత్రం ఫోకస్ చేయరు. పిల్లాడు సరిగ్గా చదువడం లేదంటే…మేం చెప్పేది చెబుతున్నాం…ఇంటి దగ్గర మీరే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలంటారు. అసరమైతే ట్యూషన్ పెట్టించాలంటారు. తప్పదని ఇవన్నీ చేసినా స్కూల్‌లో పిల్లలకు భద్రత ఉందా అంటే డౌటే. పసిపిల్లల సేఫ్టీ విషయం లో పేరెంట్స్ పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు. తీరా ఘటనలు జరిగిన తర్వాత మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ తల్లీదండ్రులకు భరోసా ఇవ్వరు. బంజారాహిల్స్ రోడ్ 14 డీఏవీ స్కూల్‌లో జరిగింది ఇదే. పర్సనల్ డ్రైవర్ మానవ మృగంగా మారితే..ప్రిన్సిపల్ అలసత్వం తల్లీదండ్రుల్ని కన్నీళ్లు పెట్టించింది.

కమిటీలు కన్నీళ్లు తుడిచేస్తాయా?

డీఏవీ స్కూల్ బాధిత తల్లిదండ్రుల గోస చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.అయ్యో పాపం అంటూ కడుపు తరుక్కుపోతోంది.మహిళా ప్రిన్సిపల్ ఉన్న పాఠశాలలోనే ఇలా జరిగితే…మిగతా స్కూళ్ల పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. బాధితులు మూడు,నాలుగు రోజులుగా పడుతున్న బాధలు చూసి వారు రగిలిపోతున్నారు. మంచి భవిష్యత్ కోసం చిన్నారుల్ని పంపిస్తే..శోకాన్ని తెప్పిస్తున్నారని వాపోతున్నారు. తాత్కాలిక కమిటీలు కన్నీళ్లు ఆపలేవని…శాశ్వత పరిష్కారం చూపాలని పేరెంట్స్ కోరుతున్నారు.

అడుగడుగునా ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే…

డీఏవీ స్కూల్ ఘటనలో ప్రిన్సిపల్ మాధవి అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. పర్సనల్ డ్రైవర్‌కు ఆమె ఇచ్చిన అలుసే దారుణానికి కారణం. డ్రైవర్‌ని క్లాస్ రూమ్‌లోకి ఎందుకు రానిచ్చారు? పైగా చిన్నారులకు డిజిటల్ క్లాసులు చెప్పడం ఏంటి? మహిళా టీచర్లు ఏమైపోయారు. క్లాస్ రూమ్‌లో డ్రైవర్ రూపంలో ఉన్న మానవ మృగం చెలరేగుతున్నా ఏం చేశారు? పసిహృదయాలు అందరినీ ఇట్టే నమ్మేస్తాయి. ఆ నమ్మకాన్ని డీఏవీ స్కూల్ వమ్ము చేసింది. నమ్మి పంపితే ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తారా? దీనికి ఎవరిది బాధ్యత?

ఆ స్కూల్‌లో అంతా డ్రైవరే…

ఈ స్కూల్‌లో పర్సనల్ డ్రైవరే షాడో ప్రిన్సిపల్. అందరూ ఇతనే మాటే వినాలట. టీచర్లు ఏదైనా చెప్పినా,పేరెంట్స్ ఫీజులు పే చేస్తే ఇతనికే అప్పచెప్పాలట. ఏ విషయమైనా డ్రైవర్ రజనీకాంత్‌కే చెప్పాలని ప్రిన్సిపల్ ఆర్డరేసేవారని ఆ స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. గేట్ బయట ఉండాల్సిన డ్రైవర్‌కు ఇంత ప్రయారిటీ ఇయాల్సిన అవసరమేంటి? అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తోంది. గతంలోనే సఫిల్ గూడ బ్రాంచ్‌లో వీరిపై ఆరోపణలు వచ్చాయి. చర్యల్లో భాగంగా అక్కడి నుంచి బంజారాహిల్స్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఇక్కడికి వచ్చినా వారి తీరు మారలేదు. అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే ఈ దారుణం జరిగేది కాదు.

ఫేమస్ స్కూళ్లో టీచర్ల కొరత

దేశంలోనే ఫేమస్ స్కూల్. 9వందలకు పైగా బ్రాంచ్‌లు.సీటు కావాలంటే ఆర్నెళ్ల ముందు నుంచి చిన్నపాటి యుద్ధం చేయాలి. వేలకు వేలు డొనేషన్లు, ఫీజులు ఇచ్చుకోవాలి. ఇంతటి ఘనమైన స్కూల్లో సరిపోను టీచర్లు ఉంటారా అంటే ఉండరు. ఈ దారుణంతో వెలుగు చూసిన పచ్చినిజం ఇదే. ఎల్‌కేజీ మూడు సెక్షన్లను కలిపి ఒకే రూమ్‌లో కూర్చోబెట్టారు. పైగా డ్రైవర్ రజనీకాంత్‌కు వారిని చూసుకొమ్మని చెప్పారు. అసలు టీచర్లు ఏమైపోయారు?చిన్నారుల అవసరాల్ని చూసుకోవాల్సిన ఆయాలు ఎక్కడ ఉన్నారు?అంటే ఇక్కడ టీచర్లు లేరు. ఆయాలు అసలే లేరు. ఇదేనా కార్పొరేట్ స్కూల్ లో నిర్వహణ బాధ్యత?

కేసు నమోదులో ఎందుకీ ఆలస్యం

అసలే బంజారాహిల్స్ బ్రాంచ్. స్థానిక నేతలు, పోలీసు అధికారులతో మంచి పరిచయాలు. ఘటన వెలుగు చూసిన వెంటనే ప్రిన్సిపల్ అండ్ కో అప్రోచ్ అయ్యారు. అంతే బాధితులు ఎంత మొత్తుకున్నా వినపడలేదు.కన్నీళ్లు కనిపించలేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలని మీడియా సాక్షిగా చేతులు జోడించి వేడుకున్నారు. అయినా పోలీసుల్లో అదే నిర్లక్ష్యం. చివరకు రాత్రీ,పగలూ ఆందోళన చేస్తే గానీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1 డ్రైవర్ రజనీకాంత్‌ను చంచల్ గూడకు జైలుకు పంపారు. ప్రిన్సిపల్ మాధవిని అరెస్ట్ చేశామన్నారు..మీడియాకు చూపించలేదు.పేరెంట్స్ రోడ్డెక్కి ఆందోళన చేస్తేనే కేసు నమోదు చేస్తారా? నిర్భయ చట్టం ఇదే చెబుతుందా? భవితకు ఇచ్చే భరోసా ఇదేనా?

ప్రతి స్కూళ్లో భద్రత కమిటీలు వేయాలి

గతంలోనూ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. చర్యలు తీసుకుని వదిలేశారు. కానీ శాశ్వత చర్యలపై దృష్టి సారించలేదు. డీఏవీ స్కూల్ ఘటనతోనైనా మేల్కొవాలి. స్కూళ్లలో సేఫ్టీ కమిటీలు వేయాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ ని క్లాసు రూమ్‌ల వైపు వెళ్లకుండా చూడాలి. ఆందోళనలో ఉన్న పేరెంట్స్‌కు పటిష్టమైన చర్యలతో అభయం ఇవ్వాలి. అన్ని స్కూళ్లలో భద్రత కమిటీలు వేయాలి. ఇందుకోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అప్పుడే చిన్నారులను స్వేచ్ఛగా స్కూల్ ‌‌ పంపగలుగుతారు.