సింగరేణిలో 155 క్లర్క్ పోస్టులు.. జూన్ 10 లోపు అప్లై చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

సింగరేణిలో 155 క్లర్క్ పోస్టులు.. జూన్ 10 లోపు అప్లై చేయండి

May 28, 2022

 

తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగనామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సింగరేణి కేలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (SCCL).. 155 క్లర్క్‌ పోస్టుల భర్తీకి మే 19న ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి మే 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా… జూన్‌ 10 వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత దరఖాస్తుల ప్రింట్లను జూన్‌ 25 నాటికి పోస్టు ద్వారా పంపించాలని సింగరేణి సంస్థ సూచించింది. కాగా.. భర్తీ చేయనున్న 155 పోస్టులలో 95 శాతం పోస్టులను సింగరేణి పనులు జరుగుతున్న 4 జిల్లాలలోని ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులకు, మిగిలిన 5 శాతం పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులో కొనసాగుతున్న అభ్యర్థుల ద్వారా భర్తీ చేస్తారు.

ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పరీక్షలో 85 మార్కులకు వెయిటేజీ ఉంటుంది. 15 మార్కులకు అసెస్‌మెంట్‌ నివేదిక ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా తుది మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. అండర్‌ గ్రౌండ్‌ వర్కర్లలో ఏడాదికి 190 మస్టర్లు పూర్తి చేసినవారు, ఉపరితలంపై పనిచేసే వర్కర్లలో ఏడాదికి 240 మస్టర్లు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆరు నెలల సర్టిఫికేషన్‌తోపాటు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. లేదా కంప్యూటర్స్‌లో డిప్లొమా కోర్సు చేసి ఉన్న వాళ్లు అర్హులు.