school bus stuck in flood with Students at kommulavancha in Mahabubabad District
mictv telugu

వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు.. విద్యార్థులు సేఫ్

July 22, 2022

school bus stuck in flood with Students at kommulavancha in Mahabubabad District

నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో కూడా ఈ ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు గ్రామంలోని కొత్తచెరువు అలుగు పారుతోంది. ఈరోజు మరోసారి జోరుగా వర్షం కురవటంతో.. వరద ఎక్కువైంది. రోడ్డుపై నుంచి మోకాలి ఎత్తుతో నీరు వెళ్తోంది. ఈ విషయం తెలియని.. తొర్రూర్ ఆర్యభట్ట పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో అదే దారి వెంట వెళ్లగా.. ప్రమాదవశాత్తు అలుగు మధ్యలో చిక్కుకుపోయింది.

వరద పెద్ద ఎత్తున పారుతుండటంతో.. దారి సరిగ్గా తెలియక బస్సు టైరు రోడ్డు దిగింది. బస్సు ఓ వైపు వంగిపోవటంతో డ్రైవర్.. వెంటనే బస్సును అక్కడే ఆపేశాడు. వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. టైర్లు మునిగేలా వస్తున్న వరదను చూసి.. చిన్నారులు పెద్ద ఎత్తున అరవటం ప్రారంభించారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. బస్సులో ఉన్న చిన్నారులను హుటాహుటిన ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవటంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు.