గృహ హింస అంటే సాధారణంగా భర్త, అత్త మామలు పెడతారని భార్య కోర్టులో కేసు పెడుతుంది. కానీ, ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో మాత్రం ఓ భార్య ప్రిన్సిపాల్ అయిన తన భర్తను కొట్టడం చూస్తే షాకవుతారు. రాజస్థాన్‌లోని భీవండిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అజిత్ సింగ్ యాదవ్ అనే ప్రభుత్వ స్కూలు ప్రిన్సిపల్ సుమన్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కొద్ది రోజులు బాగానే సంసారం నడువగా, ఆ తర్వాత పెళ్లాం తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. అట్లకాడలు, కర్రలు, చీపుర్లతో భర్తను కొట్టి హింసించేది. దీనిపై అజిత్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ విషయం తెలుసుకున్న సుమన్ ఈ సారి కేసు గీసు అంటే నేనే తిరిగి నీపై కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఎలాగైనా భార్యకు బుద్ది చెప్పాలనుకున్న అజిత్.. పెళ్లానికి తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చాడు. ఇది తెలియని భార్య ఎప్పటిలాగే భర్తను కొట్టింది. ఇలా సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియోను తీసుకొని ఈ సారి అజిత్ కోర్టుకు వెళ్లాడు. భార్య కొడుతున్న వీడియోను కోర్టుకు సమర్పించాడు. దాన్ని చూసిన జడ్జీలు సైతం పెళ్లం దాష్టీకాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అజిత్ భార్యపై వెంటనే కేసు నమోదు చేయమని, అలాగే అజిత్‌కు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలనంతరం మీడియాతో అజిత్ మాట్లాడారు. ‘సీసీ కెమెరాలు పెట్టి బతికిపోయాను. లేదంటే భార్య చేతిలో చచ్చేవాడిని. ఏమైనా చివరికి నా భార్య దుర్మార్గాన్ని అందరికీ చూపించగలిగాను’ అంటూ వెల్లడించారు.