పరీక్ష మొదలవగానే దెయ్యం పట్టింది.. బడితెపూజతో పారిపోయింది..  - MicTv.in - Telugu News
mictv telugu

పరీక్ష మొదలవగానే దెయ్యం పట్టింది.. బడితెపూజతో పారిపోయింది.. 

October 19, 2020

Schoolgirl FakedDemonic Possession To Get Out of Exam, But It Backfired.jp

సాంకేతికంగా ఎంతో ముందుకు దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో ఇంకా దెయ్యాలు, భూతాలా? అయితే బూచమ్మ కథలు బాగా విన్న ఓ చిన్నారి అవి ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేసింది. హోంవర్క్ చేయకుండా బడికి వెళ్లిన ఆ చిన్నారి టీచర్ దండన నుంచి తప్పించుకోవడానికి ఉపాయం పన్నింది. తరగతి గదిలో పరీక్ష రాయడానికి కూర్చోగానే సదరు విద్యార్థిని ఇలా దెయ్యం పట్టినట్టు తెగ యాక్టింగ్ చేయడం మొదలుపెట్టింది. కాసేపటివరకు రచ్చరచ్చ చేసి చివరకు దెయ్యంలేదని టీచర్లు తేల్చేసరికి నాలుక కరుచుకుంది. ఆ పాటికి ఎన్నో దెబ్బలు తినేసింది. ఈ విచిత్ర ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. ఖతీజా అనే బాలిక రోజూలాగే క్లాసులో టీచర్ చెప్పిన హోంవర్క్, స్టడీని పక్కన పెట్టేసి బాగా ఆటలు ఆడుకుంది. రేపే పరీక్ష అన్న ఆలోచన లేకుండా హాయిగా నిద్రపోయింది. తెల్లారి స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైంది. అప్పుడే ఆమెకు ఆరోజు నిర్వహించనున్న పరీక్ష, పెండింగ్‌లో ఉన్న హోంవర్క్‌ విషయం గుర్తుకువచ్చింది. దీంతో ఏం చేయాలా అని టెన్షన్ పడింది. కడుపు నొప్పో, కాలు నొప్పో అని తిరిగి ఇంటికి వెళ్తే అమ్మానాన్నలు పసిగట్టేస్తారని భావించింది. 

ఏం చెయ్యాలా అని తన స్నేహితురాళ్ల వద్ద వాపోయింది. అందుకు వారు ఓ అదిరిపోయే ఐడియా చెప్పారు. ఇదేదో బాగుందే అనుకుంది. కాసేపు దెయ్యం పట్టినదానిలా వీరలెవల్లో నటించేస్తానని సిద్ధమైంది. పరీక్ష ప్రారంభం కాగానే డెస్క్‌ను కొడుతూ గిబ్బరిష్‌ భాషలో దెయ్యం పట్టినదానిలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ‘దేవుడు అనేవాడు లేనేలేడు. సైతానే నా తండ్రి’ అంటూ గుడ్లురిమి చూస్తూ, నాలుకను బార్లా చాచి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన టీచర్లు స్కూలు ప్రార్థనాస్థలం వద్దకు తీసుకువెళ్లి, ‘దెయ్యం’ వదిలించే ప్రక్రియ కోసం ముగ్గురు వ్యక్తులను పిలిపించారు. ఆ వచ్చిన ముగ్గురు సదరు బాలిక కన్నా మహా ముదుర్లు. ‘ఈ అమాయకురాలిని ఎందుకు పట్టి పీడిస్తున్నావు?’ అంటూ కర్రలతో ఆమెను కొట్టసాగారు. తొలుత దెబ్బలను తట్టుకుని కాస్త మొండిగానే నిలబడ్డ ఖతీజా, దెబ్బల తీవ్రతను తట్టుకోలేకపోయింది. ‘నాకేమీ దెయ్యం పట్టలేదు మొర్రో. నన్ను కొట్టకండి. మీకు దణ్ణం పెడతా. నన్ను వదిలేయండి’ అంటూ బతిమిలాడటం మొదలుపెట్టింది. కానీ వాళ్లు మాత్రం ఆమె మాటలు నమ్మకుండా.. సైతాన్‌ ఎప్పుడూ ఇలాగే మాట్లాడిస్తాడని, దెయ్యాన్ని వదిలించేదాకా పట్టువీడమంటూ మరింతగా కొట్టసాగారు. దీంతో ఆ బాలిక అసలు గుట్టు విప్పక తప్పలేదు. ఖురాన్‌లోని పంక్తులు చదువుతూ, పరీక్ష తప్పించుకునేందుకే ఇలా చేశానని నిజం చెప్పింది. దీంతో వారు ఆశ్చర్యపోయి, అప్పటికి గాని ఆమెను వాళ్లు వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని ఓ టిక్‌టాక్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది. నెటిజన్లు ఆమె తీరుకు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.