తెలంగాణలో తెరుచుకున్న బడులు.. నేటి నుంచే ఇంగ్లీషు.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో తెరుచుకున్న బడులు.. నేటి నుంచే ఇంగ్లీషు..

June 13, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి బడి గంట మోగింది. ఆదివారంతో వేసవి సెలవులు ముగిశాయి. దాంతో ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలలు తెరుచుకున్నాయి. గత సంవత్సరం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడతామని ప్రకటించిన విధంగానే నేటీ నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటోవ తరగతి నుంచి ఎనిమిదోవ తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమంలో బోధన కూడా ప్రారంభమైంది.

అధికారులు మాట్లాడుతూ..” కరోనా నాలుగోదశ ముప్పు పొంచి ఉందన్న నివేదికలు వచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వేసవి సెలవులను పొడిగించే ప్రసక్తే లేదు. సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ఈరోజు నుంచే ప్రారంభమైంది. విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలుకుండా నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు తరహాలో తరగతులు నిర్వహిస్తాం. విద్యార్థులందరికీ తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు అందించేందుకు రూ. 120 కోట్లతో పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తయింది. విద్యార్థులకు 1.67 కోట పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఉచితంగా యూనిఫాం, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది” అని తెలిపారు.

మరోపక్క నేటి నుంచి తరగతులు ప్రారంభమైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్ని సందర్శించి, విద్యార్థులకు స్వాగతం పలికారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి, సబితా ఇంద్రా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరికి ప్రపంచస్థాయి విద్యను అందించేందుకు ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.