హామ్‌స్టర్‌ల(ఓ రకమైన చిట్టెలుకలు) మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని పెంచేలా.. ఒకదానికొకటి కలసిపోయేలా.. జార్జియా స్టేట్ యూనివర్శిటీ సైంటిస్టులు చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. ఎంతలా అంటే.. వాటి మధ్య స్నేహం అటుంచితే ఒకదానికొకటి కొరుక్కుంటూ రక్కేసుకునేలా. ఆ ఎలుకల్లో దూకుడును తగ్గించేందుకు వాటిలో ఉండే కీలక హార్మోన్‌ను తొలగించారు. వాసోప్రెసిన్ అనే హార్మోన్ లేకుండా కొత్త ఎలుకలను ఉత్పత్తి చేసిన సైంటిస్టులకు ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది.
జీన్ ఎడిటింగ్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తున్న సమయంలో అవి ఒకదానితో ఒకటి కోపంతో కొరకడం, వెంటాడడం వంటివి చేస్తూ షాకిచ్చాయి. తాము చేసిన ప్రయోగానికి ఇది పూర్తి విరుద్ధంగా జరిగిందని టెస్ట్ చీఫ్ ప్రొఫెసర్ ఇలియట్ ఆల్బర్స్ అన్నారు. ఈ రాక్షస ఎలుకల వ్యవస్థను ప్రస్తుతం అర్థం చేసుకోలేకపోతున్నామని చెప్పారు. మనుషుల్లో ఆటిజం మరియు డిప్రెషన్‌తో సహా న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్లకు పరిష్కారాలను కనుగొనడంలో భాగంగా ఈ జన్యు సవరణ పరీక్షలు చేశామని, కానీ ఇది సరైన ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. త్వరలోనే దీనికి విరుగుడు కనుక్కుంటామని చెప్పారు.