జన్యుమార్పిడి దోమలు పుట్టేశాయ్.. మలేరియాపై సూపర్ వార్ - MicTv.in - Telugu News
mictv telugu

జన్యుమార్పిడి దోమలు పుట్టేశాయ్.. మలేరియాపై సూపర్ వార్

September 24, 2022

ముల్లును ముల్లుతోనే తీయాలని సామెత. చాలా వాక్సీన్లు ఆ సూత్రంతోనే తయారవుతుంటాయి. మన శరీరంలోని వైరస్‌ను హతమార్చడానికి మేలు చేసే వైరస్‌ను ఎక్కించుకుంటాం. కరోనా టీకాలు దీనికి తాజా ఉదాహరణ. తాజాగా మలేరియా చికిత్సపైనా ఇలాంటి ప్రయోగాలు ఊపందుకున్నాయి. టీకా కాకపోయినా, అంతకంటే మేలు చేసే దిశగా కీలక మలుపు తిరిగాయి పరిశోధనలు. బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్తరకం దోమలను పుట్టించారు.

మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా సోకుతుందని మనకు తెలిసిందే. ప్లాస్మోడియం పాల్సిఫారం సూక్ష్మజీవులు సోకిన వారిని కుట్టిన దోమలు మనల్ని కుట్టి రోగం తెప్పిస్తాయి. ఆ సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి దోమలను సృష్టించారు. సాధారణ దోమల జన్యువులను మార్చి వాటిలో మలేరియా కారక సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టారు. దోమల కడుపులో ఆ జీవులు ఎదగడానికి పట్టే కాలాన్ని తగ్గించడంతో అవి దోమ తొండంలో చేరే నాటికి దోమ చనిపోయేలా చేశారు. ఇలాంటి దోమలను ఇతర దోమలతో సంకరం చేస్తే వాటికి పుట్టే దోమల్లోనూ సూక్ష్మజీవులు వ్యాప్తి తగ్గి మలేరియా నిర్మూలన సులువవుతుందని శాస్త్రవేత్తల ఆలోచన.