కరోనా చికిత్స.. సామర్థ్యం ఉన్న మరో ఔషధం  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా చికిత్స.. సామర్థ్యం ఉన్న మరో ఔషధం 

September 20, 2020

nbgc n

రోజురోజుకు తన పరిధిని విస్తరిస్తున్న కరోనా వైరస్ అంతానికి వ్యాక్సిన్ల తయారీలో దాదాపు అన్నీ దేశాలు తలమునకలై ఉన్నాయి. ఈ వైరస్‌ తీవ్రతను తగ్గించడానికి సామర్థ్యం ఉన్న మరో చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌(UCLA)కు చెందిన పరిశోధకులు 4-ఫినైల్‌ బ్యూటిరిక్‌ యాసిడ్‌(4-PBA) అనే ఔషధంపై ప్రయోగాలు చేశారు. ఈ ఔషధాన్ని తొలుత జంతువుల్లో ప్రయోగించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో సెల్యులార్‌ స్ట్రెస్‌ ఎంతో కీలకమని తేల్చారు. దీనిని తగ్గించడంలో తాజాగా మెరుగైన ఫలితాలు రావడంతో కరోనా చికిత్సకు మరో ముందడుగు పడినట్లైందని నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ‘సైటోకైన్‌ అండ్‌ గ్రోత్‌ ఫాక్టర్స్‌ రివ్యూ’ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో రక్తనాళాల్లో ఏర్పడే వాపు నియంత్రణ లేకుండా అతి ఎక్కువ సైటోకైన్ల విడుదలకు కారణం అవుతున్నాయి. దీంతో రక్తనాళాలు అత్యంగా వేగంగా స్పందించడంతో పాటు ఒక్కోసారి పలు అవయవాల వైఫల్యానికి కారణం అవుతున్నాయి. అందుకే సైటోకైన్ల ఒత్తిడి (సైటోకైన్ స్టార్మ్‌)ని నియంత్రించడమే కీలకంగా మారింది.

 కరోనా వ్యాపించినప్పుడు అవి శరీర కణాలను ప్రేరేపిస్తాయి. దీంతో ఈ కణాలు సైటోకైన్ల పెరుగుదలకు కారణం అవుతాయి. వైరస్‌ తీవ్రత పెరుగుతున్నా కొద్దీ సెల్యులార్ స్ట్రెస్‌ పెరుగుతుంది. దీంతో సైటోకైన్లు నియంత్రణలో లేకపోవడంతో వాపుకు కారణం అవుతుంది. అందుకే సెల్యులార్ స్ట్రెస్‌ని తగ్గించడమే చికిత్సలో ముఖ్యమని పరిశోధనలో పాల్గొన్న స్పెయిన్‌ శాస్త్రవేత్త ఇవాన్‌ డ్యూరాన్‌ తెలిపారు. ఈ విషయమై ఇవాన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే వివిధ చికిత్సల్లో ఉపయోగిస్తున్న 4-PBA ఔషధం ఈ సెల్యులార్ స్ట్రెస్‌ని తగ్గిస్తుందనే అంచనాకు వచ్చాం. ముఖ్యంగా ఇతర వ్యాధులతో బాధపడుతున్న కరోనా రోగులు సెల్యూలర్‌ స్ట్రెస్‌కు గురైనప్పుడు, వారు అత్యంత తొందరగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. సెల్యులార్ స్ట్రెస్‌ను వీలైనంత తొందరగా గుర్తించి చికిత్స చేయడం ఎంతో కీలకంగా మారింది. దీన్ని నియంత్రించడం ద్వారా శ్వాసకోస ఇబ్బందులతో సంభవించే మరణాలను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు’ అని ఇవాన్ తెలిపారు.