ఓ మత గురువుపై వివాదాస్పద వ్యాఖ్యల చేసి సస్పెండైన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై కొంతమంది మాజీ న్యాయమూర్తులు, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ రమణకు బహిరంగ లేఖ రాశారు. అందులో సుప్రీంకోర్టు లక్షణ రేఖను అధిగమించిందని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు ఉపసంహకరించుకునేలా ఆదేశించాలని కోరారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై తీవ్రమైన పరిణామాలకు దారి తీసే అవకాశమున్నందున, తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరమని లేఖలో పేర్కొన్నారు.
అంతేకాదు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా బెంచ్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయని, దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆమె ఒక్కరే బాధ్యులని మాట్లాడడం హేతుబద్ధంగా లేదని లేఖలో పేర్కొన్నారు. కోర్టు నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సరికాదని, ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు.. ఆమె పిటిషన్‌తో సంబంధం లేకుండా ఉన్నాయని అన్నారు. పైగా కోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మకు న్యాయ సహాయాన్ని తిరస్కరించడం మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రజాస్వామ్య విలువలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ లేఖపై 15 మంది విశ్రాంత న్యాయమూర్తులు, 77 మంది బ్యూరోక్రాట్లు, 25 మంది మాజీ సైనికాధికారులు సంతకాలు చేశారు. సంతకం చేసిన వారిలో బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎం సోనీ, రాజస్థాన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్ఎస్ రాథోడ్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎన్ ధింగ్రా కూడా ఉన్నారు.