సముద్రాల్లో నిండుతున్న గరళం..పెను విధ్వంసం తప్పదా.?
మానవ తప్పిదాల కారణంగా పర్యావరణ సమతౌల్యం గాడి తప్పుతోంది. ప్రతి రోజు వెలువడుతున్న విషపూరిత ఉద్ఘారాల వల్ల సాగర తీరాల్లో ప్రమాదపు గంటలు మోగుతున్నాయి. రాబోయే రోజుల్లో పెను విధ్వంసాలు తప్పవని ఐక్యరాజ్య సమితి తన ముసాయిదా నివేదికలో వెల్లడించింది. చైనా, అమెరికా, ఐరోపా, భారత్‌లకు సముద్రాల నుంచి ముప్పు తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) రూపొందించిన నివేదికలో ఈ భయానక నిజం బయటపడింది. అధికారిక సారాంశాన్ని సెప్టెంబరులో ప్రపంచ దేశాల ప్రతినిధులకు అందజేయనుంది. ఐక్యరాజ్య సమితి.
భూమిపై పెరుగుతున్న భూతాపం వల్ల ప్రతి ఏటా మంచు అధిక స్థాయిలో కరుగుతోందని నిపుణుల బృందం చెబుతోంది. కర్బన కాలుష్యానికి కళ్లెం వేయకుంటే రాబోయే రోజుల్లో సముద్రాల్లో నీటి మట్టం పెరిగి విధ్వంసం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మానవాళి పై ఉందన్నారు. సముద్రాల్లో విష వ్యర్థాలు నిండుతుండటంతో నీరు గరళంగా మారుతోందని అంటున్నారు. ఇటువంటి చర్యల వల్ల ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఘంటికలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. కెరటాలు ఎగిరిపడుతున్నప్పుడు రంగు మారడం, మత్య్స సంపద ప్రతి ఏటా తగ్గిపోతుండటం దీనికి సూచికగా తెలుస్తోంది. పెను తుపానులు విరుచుకుపడుతున్నాయని అంటున్నారు. ఉత్తరార్థ గోళంలో ఉన్న మంచులో దాదాపు 30 శాతం మేర ఈ శతాబ్దం చివరినాటికి కరిగిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం వల్ల వందల టన్నుల మేర కార్బన్ గాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో భూతాపం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఈ కారణంగా అనేక మహానగరాల్లో జలప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదే కనుక జరిగితే కోట్ల మంది నిరాశ్రయులు కావడం తప్పదంటున్నారు. అంతిమంగా పర్యావరణాన్ని రక్షించుకుంటే ఇటువంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉందని ఐపీసీసీ సూచిస్తోంది.