నా అమల కోసం వెతుకుతున్నా.. విజయ్  - MicTv.in - Telugu News
mictv telugu

 నా అమల కోసం వెతుకుతున్నా.. విజయ్ 

October 27, 2019

‘నా అమల కోసం వెతుకుతున్నా’ అని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది కూడా నాగార్జునతో..! విజయ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎవరు ఆ అమల? అని ఇప్పటికే విజయ్‌ని సోషల్ మీడియాలో ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్3లో దీపావళి సందర్భంగా ఇంట్లోకి వెళ్లిన విజయ్ ఈ కామెంట్లు చేశాడు.  

ఈ సందర్భంగా విజయ్ ఇంటి సభ్యులతో కలిసి సరదాగా మాట్లాడాడు. శివజ్యోతి లడ్డుకు లడ్డు అయినవేంది అని అడగడంతో విజయ్ ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వదిలింది. ఈ ప్రోమోలో.. ‘నీ పెళ్లి గురించి ప్రతి ఆర్నెల్లకు ఒక రూమర్ వస్తోంది కదా.. దీనిమీద నీ రియాక్షన్ ఏంటీ విజయ్?’ అని నాగార్జున ప్రశ్నించారు. అందుకు విజయ్ నవ్వుతూ.. ‘నా అమల కోసం వెతుకుతున్నా’ అని సమాధానం చెప్పాడు.  దీంతో నాగార్జున నవ్వుతూ.. నీ అమల నీకు దొరకాలని ఆశీర్వదిస్తున్నా’ అంటూ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఇదిలావుండగా బిగ్‌బాస్ ఇంట్లోకి ముఖ్య అతిథిగా వెళ్లిన విజయ్ ఇంకా చేసిన సందడి ఏంటో తెలుసుకోవాలంటే ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ కార్యక్రమం చూడాల్సిందే.  ప్రస్తుతం ఇంట్లో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, శివజ్యోతి, అలీరెజాలు ఉన్నారు. వీరిలో బాబా భాస్కర్, రాహుల్, శ్రీముఖి ఫైనల్స్‌కు చేరుకున్నారు.