ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ నిన్న కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్… ‘కంటి వెలుగు’ను ప్రారంభించారు. ఇక ఇవాళ్టి నుంచి తెలంగాణలో లబ్దిదారులు తమ కళ్లకు సంబంధించి ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చు. నేటి నుంచి వంద రోజుల పాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం కోసం వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమైంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 చోట్ల అధికారులు శిబిరాలను ఏర్పాటు చేసి, కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా చికిత్స చేయనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు
ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్లు, నర్సులు.. లబ్దిదారుల కళ్లను పరిశీలిస్తారు. కంప్యూటర్‌తో చెక్ చేస్తారు. కళ్లు మసకబారితే.. కళ్లద్దాలు ఇస్తారు. మందులు వాడాల్సి వస్తే.. మందులు కూడా ఇస్తారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కంటివెలుగు శిబిరాలు పనిచేస్తాయి. ప్రజలు ఈ సమయంలో ఆ శిబిరాలకు వెళ్లి.. కంటి పరీక్షలు చేయించుకోవచ్చు. ఎవరికైనా కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉంటే.. అవి కూడా చేస్తారు. ఇదంతా ఉచితంగానే జరుగుతుంది. కంటి పరీక్షల కోసం వచ్చే వారు ఆధార్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేస్తారు.
రెండో విడత కంటివెలుగును చక్కగా నిర్వహించేందుకు వైద్యాధికారులు, సూపర్ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా ఇవాళ్టి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకోసం పంచాయతీలు, రైతు వేదికలు, కమ్యూనిటీ భవనాల దగ్గర కంటివెలుగు శిబిరాలు ఏర్పాటుచేశారు. కంప్యూటర్ ద్వారా పరీక్షించి.. సాధారణ కంటి సమస్యలు ఉన్న వారికి 2 గంటల్లో రీడింగ్ గ్లాసులతో కళ్లద్దాలు ఇస్తారు. అదే దూరదృష్టి ఇతర కంటి సమస్యలు ఉంటే బార్కోడ్ విధానం ద్వారా… పది రోజుల్లో కళ్లద్దాలను ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు తెచ్చి ఇస్తారు.
ఇక ఎవరికైనా కంటి ఆపరేషన్లు చేయాల్సి వస్తే… ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఆ వివరాల్ని తీసుకొని కంప్యూటర్లో నమోదు చేయించే ఉన్నతాధికారులు.. ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడు, ఎక్కడ ఆపరేషన్ ఉండేదీ లబ్దిదారులకు ఒకట్రెండు రోజుల్లో చెబుతారు. ఆ ప్రకారం లబ్దిదారులు ఆయా ఆస్పత్రికి వెళ్లి.. ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.