సచివాలయం కూల్చివేత ఆపండి.. హైకోర్టులో పిటిషన్  - MicTv.in - Telugu News
mictv telugu

సచివాలయం కూల్చివేత ఆపండి.. హైకోర్టులో పిటిషన్ 

July 8, 2020

nvmv

తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. కూల్చివేతలకు హైకోర్టు అనుమతించడంతో మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే దాదాపు 50 శాతం పనులను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ చర్యను వ్యతిరేకిస్తున్న కొంత మంది హైకోర్టు తలుపుతట్టారు. వెంటనే కూల్చివేత పనులు నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని బుధ‌వారం ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లు చేశారు. ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు అత్యవసరంగా విచారించాలని కోరారు.

భవనాలు, రాతి కట్టడాలను కూల్చడం వల్ల దుమ్ము పెద్ద ఎత్తున వస్తుందని, దీని కారణంగా 5 లక్షల మంది పీల్చే గాలి కలుషితం అవుతుందని పేర్కొన్నారు. నిబంధనలు పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడుతున్నారని తెలిపారు. వాతావరణ కాలుష్యం జరగకుండా వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీన్ని అత్యవసర అంశం కింద విచారణకు స్వీకరించే అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఇప్పటి వరకు సీ, హెచ్, జీ భవనాలను కూల్చివేశారు. మిగితా వాటిని వేగంగా కూల్చివేసే విధంగా చర్యలు చేపట్టారు.