దసరా సందర్భంగా దేవరగట్టులో జరిగే కర్రల సమరంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. బన్నీ ఉత్సవాలు జరిపేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆలూరు, హొలగొంద, ఆస్పరి మండలాల్లో 144 సెక్షన్ విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలను జరపకూడదని సూచించారు. పూజా కార్యక్రమాలు మాత్రం యథావిధిగానే జరపాలని వెల్లడించారు. అయితే 50 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పోలీసులు సమాచారం కూడా అందించారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.
అయితే పండగ నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ సంప్రదాయ బద్ధంగా వస్తున్న కార్యక్రమం ఎందుకు నిర్వహించకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ ఏడాది బన్నీ ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 30 తేదీల మధ్యలో చేయాలని అనుకున్నారు. కానీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ప్రతి ఏటా దసరా తర్వాత రంగాన్ని తలపించేలా ఈ ఉత్సవం చేస్తారు. వివిధ గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలా మంది గాయపడి రక్తం వచ్చినా ఎవరూ పట్టించుకోరు.