అడుగు బయటపెడితే నేరుగా జైలుకే..
మహారాష్ట్రలో లాక్‌డౌన్ మరింత పటిష్టం చేశారు పోలీసులు. అక్కడ రోజు రోజుకు కరోనా రక్కసి కోరలు విప్పుతుండటంతో జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ముంబై నగరంలో 144 సెక్షన్ విధించారు. దీంతో ఎవరైనా నగరంలో ఇల్లుదాటి బయటకు వస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు. మే 17వ తేదీ వరకూ ఈ కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.
అనవసరంగా నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన వారికి 6 నెలల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. వైద్యం కోసం తప్ప వేరే ఇతర పనుల కోసం రోడ్లపైకి రావద్దని సూచించారు. అత్యవసర సమయాల్లోనూ మెడికల్ వాహనాలు మాత్రమే వాడాలని సూచించారు. ఇప్పటికే మహారాష్ట్రఈ మహమ్మారి దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రభావం తగ్గడం లేదు. దీంతో మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.