సమానత్వం మనకు అవసరమా?.. ఉమాభారతి - MicTv.in - Telugu News
mictv telugu

సమానత్వం మనకు అవసరమా?.. ఉమాభారతి

September 28, 2018

వివాహేతర సంబంధం నేరం కాదని, స్త్రీపురుషులు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధం పెట్టుకుంటే చట్టాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని  సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై మిశ్రమ స్పందన వస్తోంది. తీర్పుతో మహిళలకు స్వేచ్ఛ లభించిందని కొందరు, భారతీయ కుటుంబ వ్యవస్థ మరింతగా పతనమౌతుందని కొందరు అంటున్నారు.
Section 497, ayodhya Uma bharati sensational comments on Supreme Court verdict
వివాహేతర సంబంధాన్ని నిషేధించే బ్రిటిష్‌ కాలంనాటి ఏకపక్ష ఐపీపీ సెక్షన్‌ 497ను కోర్టు కొట్టేసింది. అది మహిళల సమాన హక్కులు, న్యాయానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది.  అయితే ఇది సరైంది కాదని  కేంద్రమంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో మహిళలకు సమానత్వం కంటే ఎక్కువ గౌరవమే ఉదందని, విదేశీ సమానత్వ భావన మనకు అక్కర్లేదన్నట్లు మాట్లాడారు. ‘మనదేశంలో మహిళలను మగవారికన్నా ఎక్కువగా చూస్తాం. గౌరవిస్తాం. అసలు ఈ  సమానత్వం అనేది విదేశాల భావన. మహిళలకు గౌరవం లేని చోట రాక్షసులు వుంటారని మన పెద్దలు చెప్పారు. అలాంటి మన దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని కోర్టుకు వెళ్ళడం సబబు కాదు. పాశ్చాత్య దేశాల్లో అమలౌతున్న సమానత్వం మనదేశంలో చెల్లుబాటు కాదు. జనాలు ప్రతి చిన్న విషయానికి కోర్టులకు ఎందుకు వెళుతున్నారో అర్థం కావడంలేదు’ అని వ్యాఖ్యానించారు.  

అయోధ్య ముస్లింలకు పవిత్ర స్థలం కాదు…

అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు కీలక రూలింగ్‌పైనా ఉమాభారతి స్పందించారు. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు గనకే హిందువులకు అది పవిత్ర స్థలం… ముస్లింలకు కాదని అన్నారు. ముస్లింలకు సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర స్థలం అన్నారు. అయోధ్యలో రామమందిరంబాబ్రీ మసీదు వివాదం కేసును ఐదుగురు జడ్జీల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో తీర్పును ఇచ్చింది. కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ చివరివారంలో విచారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.