సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలకు రక్షణ శాఖ ఎనిమిదేళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్నిరోజులుగా ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. మొత్తం 8 వార్డులుండగా, 57 కంటోన్మెంట్స్‌లలో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుకు చివరగా 2015లో ఎన్నికలు జరిపారు. అదే ఏడాది ఫిబ్రవరిలో బోర్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. 2020తో వారి పదవీ కాలం ముగిసినా మళ్లీ ఎన్నికలు జరుపలేదు. దీంతో 2015లో ఎన్నికైన పాలక మండలినే 2021 ఫిబ్రవరి వరకు కొనసాగిస్తూ వచ్చారు. 2021 నవంబరులో బోర్డుకు సివిల్ నామినేటెడ్ సభ్యుడిని నియమించిన రక్షణ శాఖ.. ఆ పదవీకాలాన్ని 202 ఫిబ్రవరి వరకు పొడిగించింది. తర్వాత ఆగస్టులో కూడా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.