ఓ కేసు విషయంలో ఎంక్వయిరీ కోసం వచ్చిన పోలీసులు కాస్త అతి ప్రదర్శించారు. విచారణ పేరుతో ఓ జిమ్ ట్రైనర్‌ను ఇష్టానుసారంగా కొట్టారు. ఆ దాడిలో అతడి కాలు విరగడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడలో ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ లాలాగూడ చెందిన సూర్య ఆరోక్యరాజ్ (25) జిమ్ నడుపుతున్నాడు. ఈనెల 3న బైక్ విషయంలో మరో వ్యక్తితో అతనికి చిన్న గొడవ జరిగింది. ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నలుగురు కానిస్టేబుళ్లు రాత్రి 11 గంటల సమయంలో ఆరోక్యరాజ్ వద్దకు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పారు. రాత్రి అయిందని.. ఉదయం వస్తానంటూ అతడు వారికి సమాధానమిచ్చాడు. కోపంతో ఊగిపోయిన ఆ నలుగురు ఆరోక్యరాజ్ పై దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టి కాళ్లతో తన్నారు.
కానిస్టేబుళ్ల దాడిలో బాధితుడికి శరీరమంతా గాయాలు కావడంతో పాటు కాలు విరిగింది. బస్తీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కానిస్టేబుళ్లు ఆరోఖ్యరాజ్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులే బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఈ ఘటనను ఇక్కడితో వదిలేయాలని పోలీసులు తనతో బేరసారాలకు వచ్చినట్లు బాధితుడు చెప్పారు. కానీ ఆరోఖ్యరాజే ముందు తమపై దాడి చేసేందుకు యత్నించాడని.. తాము ప్రతిదాడి చేశామని కానిస్టేబుళ్లు చెబుతున్నారు.