సికింద్రాబాద్ అల్లర్లు: యువకుడు ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

సికింద్రాబాద్ అల్లర్లు: యువకుడు ఆత్మహత్య

June 22, 2022

 

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వందల మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని, కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ అల్లర్లలో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నిరసనలో పాల్గొనందుకు పోలీసులు తనపై కచ్చితంగా కేసు పెడతారన్న భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అజయ్‌ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో అజయ్‌ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ.. ”వాట్సాప్‌ మెసేజ్‌ రావడం వల్లే నేను అక్కడికి వెళ్లాను. నేను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ ఫైరింగ్‌ జరిగింది. ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నా. ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అప్లై చేశాను. ఆందోళనల్లో పాల్గొనందుకు నాపై కేసు బుక్కైయితే ఉద్యోగం రాదు అనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించాను” అని అన్నాడు. ప్రస్తుతం అజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.