Secunderabad Ujjaini Mahankali Lashkar bonalu started today by Minister Talasani Srinivas Yadav
mictv telugu

తల్లి బయిలెల్లినాదో.. ఘనంగా ప్రారంభమైన లష్కర్ బోనాలు..

July 17, 2022

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతకంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పాత రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపు నుంచి సాదారణ భక్తులు, వీఐపీ పాస్‌లతో వచ్చే వారిని, బోనాలతో వచ్చే వారిని కూడా ఇక్కడి నుంచి అనుమతి ఇస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం బాటా నుంచి ఒక క్యూలైన్‌. టొబాకో బజార్‌ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్‌ నుంచి వీఐపీ, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్‌ నేడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి.. పర్యటన అనంతరం ఏటూరునాగారం నుంచి హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు.