ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భద్రతాలోపం చోటుచేసుకుంది. జాతీయ యువజన ఉత్సవాలను ప్రారంభించేందుకు కర్ణాటక రాష్ట్రం హుబ్బళిలో ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. వేదిక వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో కారు ఫుట్ బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఇంతలో ఓ యువకుడు పూల దండతో అకస్మాత్తుగా మోదీ కాన్వాయ్ వైపు దూసుకొచ్చాడు. సెక్యూరిటీ బారికేడ్లను దాటుకొని ప్రధానికి దండ వేయడానికి ప్రయత్నించాడు. వెంటనే ఎస్పీజీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై చివరి నిమిషంలో యువకుడిని లాగేశారు.
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
— ANI (@ANI) January 12, 2023
కానీ, మోదీకి అత్యంత సమీపానికి రావడం చర్చనీయాంశమైంది. అటు మోదీ చిరునవ్వుతో యువకుడి నుంచి పూల దండను స్వీకరించి కాన్వాయ్ పైన వేసి ముందుకు సాగిపోయారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రతీ ఏటా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఐదు రోజులు జరిగే ఈ ఉత్సవాలకు గతేడాది పుదుచ్చేరి ఆతిథ్యం ఇవ్వగా ఈ సారి కర్ణాటక వంతు వచ్చింది. అటు అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.