సహనానికి పరీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

సహనానికి పరీక్ష

December 15, 2017

సీత రాముని కోసం… ఇలాంటి సాఫ్ట్ టైటిల్ చూస్తే ఇందులో ఏదో విషయం ఉండి తీరుతుందనే ఆలోచన సగటు సినీప్రేక్షకుడిలో కలగకమానదు. కథాబలమున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని సాధించిన దాఖలాలు ఉండటంతో ఇది కూడా అలాంటి కోవకు చెందిన సినిమానే అనుకొని థియేటర్‌లో అడుగుపెడితే ఆఅభిప్రాయం మారడానికి ఎంతో సమయం పట్టదు.  షార్ట్‌ఫిల్మ్  కోసం తయారుచేసిన కథతో రెండుగంటల సినిమాతీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి సీత రాముని కోసం సరైన ఉదాహరణగా చెప్పవచ్చు.

కుటుంబ బంధాలకు హారర్, సస్పెన్స్ అంశాలను  మేళవించి రూపొందించిన చిత్రమిది. విక్రాంత్(శరత్ శ్రీరంగం) ఓ ప్యారా సైకాలజిస్ట్. ఆత్మలపై పరిశోధన చేస్తుంటాడు. మరణానంతరం నాశనం కాకుండా భూమిపై తిరగాడే ఆత్మల చివరి కోరికలు తీర్చుతూ వాటికి ముక్తి  ప్రసాదిస్తుంటాడు. హైదరాబాద్‌లో ఉన్న తన అక్క  కోసం ఓ భవంతిని కొనుగోలు చేస్తాడు విక్రాంత్. కానీ అందులో దయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండటంతో  వాస్తవలేమిటో తెలుసుకోవడం కోసం ఆ భవంతిలోకి అడుగుపెడతాడు.ఆ బంగ్లాలో సీత, అంజలి అనే తల్లీకూతుళ్ల ఆత్మలు ఉన్నాయనే నిజం అతడికి తెలుస్తుంది. వారెవరు? సీత, అంజలి మరణానికి కారణమేమిటి? ఎవరి కోసం వారుఎదురుచూస్తున్నారు? ఆర్ట్ డైరెక్టర్‌రామ్(ఆనిల్ గోపిరెడ్డి)తో వారికున్న సంబంధమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటల్లో భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనో, మరొకరితో అక్రమ సంబంధాలు కలిగిఉన్నాడనో తొందరపాటుతో మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారితో పాటు అభంశుభం తెలియనిచిన్నారులను తమ కోపతాపలకు బలిచేస్తున్నారనే పాయింట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు, భర్తల్లోమార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం లేదని, అంతేకాకుండా భర్తే ప్రపంచంగా బతికే భార్యల కలలు కల్లలయితేవారు పడే సంఘర్షణను సినిమాలో చూపించాలనుకున్నారు దర్శకుడు అనిల్ గోపిరెడ్డి. ఆసక్తిరమైన మలుపులు,హారర్ ఎలిమెంట్స్‌తో కథనాన్ని పకడ్బందీగా అల్లుకుంటే ఈ  కథ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పించేది. కానీదర్శకుడు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. సినిమాలో ఎక్కడ భయపెట్టే సన్నివేశాలు, ప్రేక్షకుల్నికట్టిపడేసే ఎమోషన్స్‌గానీ కనిపించవు.  ఆద్యంతం నత్తనడకన సాగుతుంది. హీరో దేని కోసం అన్వేషిస్తున్నాడో, ఆబంగళాలో ఆత్మలు ఎందుకున్నాయో, తెరపై ఏం జరుగుతుందో సూటిగా చెప్పకుండా కాలక్షేపం చేస్తుంటాడు.

ప్రథమార్ధం మొత్తం ఆత్మల గురించి తెలుసుకోవడానికి హీరో చేసే వింత ప్రయత్నాలు, అతడి బిత్తరచూపులతో ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తుంది.  అప్పటివరకు ఏం జరిగిందో అర్థంకాక, ఇక ముందు ఏం జరుగనుందో అంతుపట్టక ఓ కప్పు టీ తాగి ద్వితీయార్ధం కోసం మళ్లీ సీట్‌లో కూర్చున్న ప్రేక్షకులు శుభం కార్డు కోసంఎదురుచూడటం తప్ప చేసేదేమీ ఉండదు. భార్యభర్తలు, వారి అపార్థాలు అంటూ ఓ పిట్ట కథను చూపించారు.అందులో ఎలాంటి కొత్తదనం కనిపించదు. వారి అనుబంధాన్ని, విడిపోయే సన్నివేశాలు, భర్త తన తప్పునుతెలుసుకొని పశ్చాత్తప పడే సన్నివేశాలుగానీ  ఏ ఒక్కదాన్ని తెరపై బలంగా ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు.

కథలోని లోపాలను కప్పిపుచ్చే సరైన నటులు లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ఉన్నంతలో సినిమాలో కారుణ్య చౌదరి అభినయం పర్వాలేదనిపిస్తుంది. హీరో శరత్ శ్రీరంగంతో పాటు ప్రధాన పాత్రలో  నటించిన అనిల్ గోపిరెడ్డి సినిమాకు పెద్ద మైనస్‌గా మారారు. వారి  నటనలో ఎక్కడ హుషారు కనిపించదు. తమలోని మైనస్‌లను కనబడనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అవి వర్కవుట్ కాలేదు. వారి హావభావాలు ఒక్కటీ అర్థంకావు. వారితో పోలిస్తే ఇద్దరు చిన్నారులు బాగా చేశారు.

కామెడీ లేకపోవడం సినిమాకు పెద్దలోటుగా చెప్పవచ్చు. అలాగే సాగతీత ధోరణి ఎక్కువగా ఉండటంతో నిడివి తక్కువైనా మూడు గంటల సినిమా చూసిన భావన కలిగిస్తుంది. సాంకేతికంగా అనిల్‌ గోపిరెడ్డి నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్‌లో కొన్ని పాత్రలతో నాణ్యతతో సినిమాను చేశారు. అయితే కథలోనిబలహీనతల కారణంగా అవి కనిపించకుండా పోయాయి.

ప్రేక్షకుడి ఓపికకు, సహనానికి పరీక్ష పెట్టే చిత్రమిది.  సినిమాలో సీత రాముని కోసం ఎదురుచూసినట్లు థియేటర్‌లో అడుగుపెట్టిన ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు బయటకు వెళదామా అని నిరీక్షించాల్సివస్తుంది.

రేటింగ్-2/5