రెండు లైన్ల రెజ్యూమ్ కు కోచ్ పదవి వచ్చేస్తుందా... - MicTv.in - Telugu News
mictv telugu

రెండు లైన్ల రెజ్యూమ్ కు కోచ్ పదవి వచ్చేస్తుందా…

June 6, 2017


టీమిండియాకు కొత్త కోచ్ ఎవరు…కొత్త కోచ్ కోసం వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ఆరుగురు అప్లయ్ చేసుకున్నారు. వీరిలో ప్రధానంగా టామ్‌ మూడీ, సెహ్వాగ్‌ మధ్య పోటీ ఉండొచ్చు. రెండు లైన్ల రెజ్యూమ్ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ కే ఎక్కువ చాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే…
ఈ నెల 20తో టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్‌కుంబ్లేతో ఒప్పందం ముగుస్తుంది. ఇప్ప‌టికే టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇక ఇంట‌ర్వ్యూలు జ‌ర‌గాల్సి ఉంది. ఇండియ‌న్ టీమ్‌కు కోచ్‌గా ఉండ‌టానికి లెజెండ‌రీ క్రికెట‌ర్లు కూడా పోటీప‌డున్నారు. ఇండియన్ మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కోచ్ ప‌ద‌వికి అప్లై చేసుకున్నాడు.వీరూతోపాటు కోచ్ ప‌ద‌వి రేసులో ఇప్ప‌టి కోచ్ అనిల్ కుంబ్లే, టామ్ మూడీ, రిచ‌ర్డ్ పైబ‌స్‌, లాల్‌చంద్ రాజ్‌పుత్‌, క్రెయిగ్ మెక్‌డెర్మాట్‌, దొడ్డ గ‌ణేష్ ఉన్నారు.

రేసులో ముందు ఉన్నాడనుకున్న సెహ్వాగ్ రెండే రెండు లైన్లలో దరఖాస్తును బీసీసీఐకి పంపాడు.అందులో ఏముందంటే ‘ప్రతిష్ఠాత్మక ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు కోచ్‌, మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుత భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరితో కలిసి గతంలో ఆడాను’ అని మాత్రమే పేర్కొన్నాడు. అనుభవం, తన నైపుణ్యాలు, ప్రత్యేకతల గురించి వివరించే ఎలాంటి పత్రాలను జతచేయలేదు. సెహ్వాగ్‌ దరఖాస్తు చూసిన బీసీసీఐ ప్రతినిధులు.. దరఖాస్తుతో పాటు తాను ఏ విధంగా ఈ పదవికి అర్హుడన్న విషయాన్ని తెలియజేసే పత్రాలను జతచేయాలని కోరారు. గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌తో కూడిన క్రికెట్‌ సలహా మండలి త్వరలో కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ ఇంటర్వ్యూలు ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తారని, సెహ్వాగ్‌ను స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారని ప్రచారం జరుగుతోంది

మరోవైపు ఆస్ట్రేలియన్ లెజెండ‌రీ లెగ్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ కూడా టీమిండియా కోచ్ ప‌ద‌విపై ఆస‌క్తి చూపించాడు. కోహ్లితో క‌లిసి తాను అద్భుతాలు చేస్తాన‌ని చెప్పాడు. బీసీసీఐ మాత్రం త‌న‌ను కోచ్‌గా భ‌రించ‌లేద‌ని, ఇంత‌కుముందు చెప్పిన‌ట్లు కోచ్ ప‌ద‌వికి నేను చాలా ఎక్కువ మొత్తం తీసుకుంటానని వార్న్ చెప్పాడు.ఎవరెన్ని చెప్పినా ప్రధానపోటీ మాత్రం ప్రధానంగా టామ్‌ మూడీ, సెహ్వాగ్‌ మధ్య ఉండొచ్చు. ఇందులో వీరూకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి టీమిండియా కొత్త కోచ్ పదవి ఎవరనీ వరిస్తుందో…