ట్రాఫిక్ తలనొప్పి నివారిణి.. ఎగిరే టాక్సీ వచ్చేసింది! - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ తలనొప్పి నివారిణి.. ఎగిరే టాక్సీ వచ్చేసింది!

October 23, 2019

driving ...

రోజురోజుకు నగరాల్లో మనుషులకు సమానంగా వాహనాలు కూడా పెరిగిపోతున్నాయి. కార్లు, బైకులు ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కొన్ని ఇళ్లల్లో మనిషికి ఒక వాహనం అన్న తీరుగా తయారైంది. దీంతో సిటీల్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతోంది. ఎప్పుడైనా ట్రాఫిక్ జాం అయిందంటే ఇంక అప్పుడు ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా నరకం ఎలా ఉంటుందో కళ్ల ముందు కనబడుతుంది. ఈ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో గాలి, ధ్వని కాలుష్యం బాగా పెరిగిపోతోంది. మరి దీనికి నివారణే లేదా? అంటే ఉంది అంటోంది జర్మన్‌ కంపెనీ వోలోకాప్టర్‌ సంస్థ.

రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ రద్దీని నివారణకై వారు సరికొత్తగా ఫ్లైయింగ్ టాక్సీని తీసుకువచ్చారు. 36 మోటార్లు కలిగి, రెండు సీట్లు వున్న ఈ కారు గాల్లో ఎగురుతుంది. దీంతో విమానం ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది అంటున్నారు సంస్థ అధికారులు. రెండు రోజుల క్రితం ఈ ఎగిరే టాక్సీని సింగపూర్‌లో ప్రయోగాత్మకంగా నడిపి చూశారు. ఈ టాక్సీని జర్మన్‌ కంపెనీ వోలోకాప్టర్‌ అభివృద్ధి చేసింది. డ్రోన్ మాదిరి ఎగిరే ఈ ఫ్లైయింగ్ టాక్సీ ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది. లెక్కకుమించి పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ జాంలను నివారించడానికి ఫ్లైయింగ్ టాక్సీలు చక్కటి నివారణ వాహనాలు అంటున్నారు వోలోకాప్టర్ నిర్వాహకులు. రెండేళ్లలో వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మన హైదరాబాదుకు కూడా వస్తే బాగుంటుంది కదూ.