సెల్ఫీకి ట్రై చేశాడు.. తొండంతో బాది చంపేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీకి ట్రై చేశాడు.. తొండంతో బాది చంపేసింది..

November 24, 2017

సెల్ఫీ పిచ్చికి, ఆ పిచ్చితో వచ్చే ముప్పుకు తాజా ఉదాహరణ ఇది. పశ్చిమ బెంగాల్లో ఒక వ్యక్తి ఏనుగుతో సెల్ఫీ దిగబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. జల్‌పాయ్‌గురి జిల్లాకి చెందిన సాదిఖ్‌ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డు. గురువారం పని అయిపోయాక  సాయంత్రం లతాగురి అటవీ ప్రాంతం నుంచి ఇంటి వెళ్తున్నాడు. ఇంతలో దారిలో ఓ ఏనుగు కనిపించింది. సాదిఖ్ దాంతో కలసి సెల్ఫీ దిగాలని సరదాపడ్డాడు.  దానికి చాలా దగ్గరగా వెళ్లాడు. అతడు తనను ఏదో చేస్తున్నాడనే భయంతో ఏనుగు తొండంతో దాడికి దిగింది. అతణ్ని తొండంతో బాది చంపేసింది.రోడ్డుపై వెళ్తున్నవారు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఏనుగు వెళ్లిపోయాక స్థానికులు.. సాదిఖ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, వాటితో చెలగాటం ఆడొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో ఏనుగుల దాడిలో 84 మంది చనిపోయారు.