కొన్ని నీచనికృష్టాలు కథలకు, సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. ఆ మాటకొస్తే సినిమాను తిరగేస్తే మనిసి అని వస్తుంది కదా. మనిషి జీవితంలోని కథలే సినిమాల్లోకి వస్తాయి. ఊహకు అందనివి కూడా ఉంటాయి. ఓ త్రాష్టుడు ప్రమోషన్ కోసం అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను బాస్ పడక దగ్గరికి పంపబోయి చిక్కుల్లోపడ్డాడు. ఆమె ఎదురుతిరగడంతో విషయం బయటికి పొక్కొంది. మహారాష్ట్రలోని పుణేలో జరిగిందీ ఘటన.
అమిత్ చాబ్రా ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. కెరీర్లో పైకి ఎదగాలని ఆరాటం. బాస్‌ను మంచి చేసుకోవడానికి భార్యను ఎరవేయబోయాడు. బాస్‌తో గడిపితే తనకు క్షణాల్లో ప్రమోషన్, అదనపు అలవెన్సులు వస్తాయని మరింత విలాసంగా బతకొచ్చని చెప్పాడు. ఆమె ముఖమ్మీదే ఛీకొట్టి, ఆ పని చచ్చినా చేయనంది. అయినా చాబ్రా వదలకుండా పదేపదే ఆ విషయం ప్రస్తావిస్తూ వేధించాడు, కొట్టాడు. ఆమెకు చిర్రెత్తి కోర్టుకు తొలుత పోలీసులను ఆశ్రయించింది.
భర్త నిర్వాకం మొత్తం పూసగుచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా తన మరిది రాజ్ కూడా తనపై తన కూతురు ఎదుటే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయినా చాబ్రా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆమె ఫిర్యాదును స్వీకరించి విచారణ జరుపుతామని తెలిపింది.