స్వార్థం లేని గంగవ్వ.. నేను వెళ్లిపోతా..  - MicTv.in - Telugu News
mictv telugu

స్వార్థం లేని గంగవ్వ.. నేను వెళ్లిపోతా.. 

September 14, 2020

బిగ్‌బాస్ షోకు కావాల్సింది గ్లామర్ అని.. స్కిన్ షోలతో ఆ కార్యక్రమం ఆసాంతం సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే అలాంటి షోకు గ్లామర్ కాకుండా గ్రామర్ కూడా ఎంతో అవసరం అని మై విలేజ్ షో గంగవ్వ రాకతో తేలిపోయింది. అమాయకత్వం, మట్టి తత్త్వం, నిస్వార్థం, నాటకీయత అస్సలు లేని స్వచ్ఛమైన మాటలు, అలా మాట్లాడితే వాళ్లేం అనుకుంటారో అనే జంకు లేకుండా తనదైన యాసలో మాటలు, పాటలు, నడవడిక, పల్లెతల్లి కట్టుబొట్టుతో బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గంగవ్వ. గంగవ్వ మాట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడనివారు లేరు. గంగవ్వ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. 

ఇంట్లో అందరూ ఆమెను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. బిగ్‌బాస్ కూడా ప్రత్యేకమైనన అభిమానంతో ఆమెకు ప్రత్యేకంగా బాత్ రూం ఏర్పాటు చేశారు. ఇంట్లో అందరి మనసులు దోచుకుని వారందరికీ పెద్దదిక్కులా మారింది గంగవ్వ. ఆమెను ఇంట్లో చూసి ఆమె అభిమానులు విపరీతంగా ఓట్లు వేస్తున్నారు. దీంతో ఆమె తొలి ఎలిమినేషన్ నుంచి చాలా అవలీలగా బయటపడింది. అందరేమో తాము ఇంట్లోంచి వెళ్లొద్దని కోరుకుంటే.. గంగవ్వ మాత్రం నేనే వెళ్లిపోతానని చెబుతోంది. తనకు ముగ్గురు మనవళ్లు, నలుగురు మనవరాళ్లు అని చెప్పిన గంగవ్వ వారిని చూడకుండా ఉండలేనని తెలిపింది. ‘నాకు మనుసు గుంజినప్పుడు బిగ్‌బాసు, నాగార్జున సారు నన్ను ఇంటికి పంపియ్యాలె. నాకు అప్పుడప్పుడు తల్కాయ నొస్తది. నేను పోత అన్నప్పుడు పంపియ్యాలె’ అని గంగవ్వ అంది. ‘నువ్వు పోతా అన్నా ప్రేక్షకులు పంపించరు గంగవ్వా.. నువ్వు ఇక్కడ ఉండాలని, వెళ్లిపోవాలని డిసైడ్ చేసేది నువ్వు నేను, ఆ బిగ్‌బాస్ కాదు ప్రేక్షకులే’ అని నాగార్జున నవ్వులు పూయించాడు. తొలివారం ఎలిమినేట్ అయినవారిలో తొలుత లాస్య గట్టెక్కి ఇంటికి కెప్టెన్ అయింది. అలాగే జోర్దార్ సుజాత, కళ్యాణి, అభిజిత్, నోయెల్, దివి సేవ్ అయ్యారు. చివరికి ఓటింగ్ తక్కువగా నమోదు అవడంతో దర్శకుడు సూర్యకిరణ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్ అయ్యారు. సూర్యకిరణ్‌కు గంగవ్వ పెట్టిన ముద్దుపేరు ‘పంచాదికారి’. ఇక సూర్యకిరణ్ ప్లేసులో బస్ స్టాప్, ఈరోజుల్లో ఫేమ్ కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంట్లోకి వెళ్లాడు. 

ఇదిలావుండగా ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో.. రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైనట్టు చూపించారు.  ఓ పడవను తీసుకొచ్చి అందులో ఇంటి సభ్యులంతా ఎక్కాలని బిగ్‌బాస్ ఆదేశించారు. ఒకసారి ఎక్కిన తర్వాత మళ్లీ దిగకూడదు. పడవ తీరానికి చేరుకున్నాక హారన్ మోగాకే.. ఒక సభ్యుడు పడవ నుంచి కిందకు దిగాల్సి ఉంటుంది. అందుకోసం మిగతా హౌస్‌మేట్స్ ఒకరిని కన్విన్స్ చేయాలి. అలా పడవ దిగిన వ్యక్తి.. ఈ వీక్ నామినేషన్స్‌లో ఉంటాడు. అయితే పడవ దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. గంగవ్వ నేనే దిగిపోతానని చెప్పి పడవ దిగే ప్రయత్నం చేస్తుంది. అంతలోనే మిగతా సభ్యులు జోక్యం చేసుకుని వద్దు అని చెబుతారు. మరి గంగవ్వ పడవ నుంచి దిగిపోయి సెల్ఫ్ నామినేట్ చేసుకుంటుందా? లేదా అనేది ఈరోజు కార్యక్రమంలో చూడాల్సిందే.