Selling babies on whatsapp in khammam
mictv telugu

ఖమ్మంలో ఘోరం… వాట్సాప్‌లో పసికందుల అమ్మకం

June 7, 2022

Selling babies on whatsapp in khammam

అప్పుడే పుట్టిన శిశువులను అమ్ముతున్న ముఠాను పోలీసులు, అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అందులో ఓ మహిళను ఆమెతో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం పట్టణంలో ఆరు నెలలుగా జరుగుతున్న ఈ అక్రమ మానవ రవాణాను విజయవంతంగా అడ్డుకోగలిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న వినోద్ థియేటర్ సమీపంలో ఉన్న మరుగుదొడ్లను నిర్వహిస్తున్న మహిళ పసిపిల్లలను అమ్ముతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ముందుగా మూడు నెలలు నిఘా వేసి నిజంగా పిల్లలను అమ్ముతుందని నిర్ధారించుకున్నారు. అనంతరం కస్టమర్లుగా మహిళను నమ్మించి ట్రాప్ చేశారు.

నాలుగు లక్షలకు బేరం కుదరగా, ముందుగా 50 వేలు చెల్లించాలని షరతు పెట్టింది. ఒక శిశువు నచ్చాడని చెప్పి రూ. 50 వేలు చెల్లించగా, కొద్ది రోజులకు ఆ శిశువును వేరే వాళ్లకి అమ్మేసానని, మీకు మరో శిశువును చూస్తానంటూ వాట్సాప్‌లో వాయిస్ మెసేజులు పెట్టేది. వాటితో పాటు శిశువుల ఫోటోలు, ధరలు వంటివి పెట్టేది. కొన్నిరోజులకు ఓ మహిళ ప్రసవానికి వస్తుందని, ప్రసవం తర్వాత వారం రోజుల్లో డిశ్చార్జ్ అవుతుంది డబ్బు రెడీ చేసుకోమని చెప్పింది. ఈ క్రమంలో మహిళ చెప్పిన గర్భిణీ వద్దకు వెళ్లి ముందుగా మారువేశంలో ఉన్న పోలీసులు డబ్బు చెల్లించారు. కొంతసేపటి తర్వాత బాండు పేపరు రాయించి ఇచ్చి పుచ్చుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు మహిళను పట్టుకున్నారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, ఆడపిల్ల అమ్మకం గురించి ఆమె పాప తండ్రిని ప్రశ్నించగా, నిజమేనని ఒప్పుకున్నాడు. రూ. 4 లక్షలలో తనకు కేవలం రూ. 50 వేలు మాత్రమే ఇస్తారని చెప్పుకొచ్చాడు.